పంజాబ్–​‌‌హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టియర్​ గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు

పంజాబ్–​‌‌హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టియర్​ గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు

పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలో నిరసన తెలియజేసేందుకు ..  శంభు వద్దకు చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై టియర్​ గ్యాస్​  ప్రయోగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు, కేంద్ర మంత్రులతో సోమవారం ( ఫిబ్రవరి 12)  సమావేశం నిర్వహించారు. అయితే అది అసంపూర్తిగానే, తీర్మానం లేకుండానే ముగియడంతో 200కు పైగా రైతు సంఘాలు ఢిల్లీలో మార్చ్ ను కొనసాగించాలని నిర్ణయించాయి.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంట్ వరకూ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు అన్నదాతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ మార్చ్ ను అన్నదాతలు మంగళవారం ( ఫిబ్రవరి 13)  ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు పంజాబ్ (Punjab)లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు. అటు సంగ్రూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా కదిలింది.

తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ వెళ్లే మార్గంలో హర్యానాలోని అంబాలా వైపు వెళ్తున్న రైతులను రాజ్ పురా బైపాస్ దాటేందుకు పంజాబ్ పోలీసులు అనుమతించారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి.

హర్యానా‌‌ పంజాబ్ తో ఉన్న సరిహద్దుల వెంబడి భద్రతను హర్యానా అధికారులు కట్టుదిట్టం చేశారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా వంటి ప్రాంతాల్లో కాంక్రీట్ బ్లాక్ లు, ఇనుప గోళ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. హర్యానా  సరిహద్దు ప్రాంతంలో 11 కంపెనీల పారామిలటరీ సిబ్బందిని, 50 కంపెనీల హర్యానా పోలీసులను వివిధ జిల్లాల్లో మోహరించారు. 

రైతులపై భాష్పవాయువు ప్రయోగం


ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడిక్కడ పటిష్ట చర్యలు చేపట్టారు. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు అధిక సంఖ్యలో వచ్చిన అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఢిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు తీవ్ర చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బాష్పవాయువు ప్రయోగంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయాయి. అలాగే, పోలీస్ బలగాలు డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ జారవిడిచారు. ఈ సందర్భంగా వచ్చిన శబ్ధానికి నిరసనకారులు, మీడియా ప్రతినిధులు పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు వారి ప్రణాళిక ప్రకారమే 'ఢిల్లీ ఛలో' మార్చ్ ప్రారంభించారని.. రెచ్చగొట్టే ఎలాంటి చర్యలు చేయకపోయినా పోలీసులు ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఢిల్లీ సరిహద్దుల్లో అలర్ట్

రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారి నిరసనలు భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఢిల్లీ నగర సరిహద్దుల్లో భారీగా బలగాలు మోహరించారు. రహదారులపై భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ ను మూసివేశారు. సరిహద్దుల్లో భద్రతా చర్యల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. గాజీపూర్, జిల్లా సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై కి.మీల మేర వాహనాలు బారులు తీరాయి. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటకు పైగా సమయం పడుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.