ప్రతీకాకు గాయం.. గ్రౌండ్‎లోనే నొప్పితో విలవిలలాడిన ఆల్ రౌండర్.. సెమీస్ ముందు ఇండియాకు బిగ్ షాక్..!

ప్రతీకాకు గాయం.. గ్రౌండ్‎లోనే నొప్పితో విలవిలలాడిన ఆల్ రౌండర్.. సెమీస్ ముందు ఇండియాకు బిగ్ షాక్..!

ముంబై: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీస్ ముంగిట టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ ప్రతీకా రావల్ తీవ్రంగా గాయపడింది. ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‎తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ప్రతీకాకు ఇంజ్యూరీ అయ్యింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపబోయే క్రమంలో కాలు మలుసుని కిందపడింది. దీంతో గ్రౌండ్‎లోనే నొప్పితో ప్రతీకా విలవిలలాడింది. 

నొప్పితో బాధపడుతున్న ప్రతీకా సహాయక సిబ్బంది సహాయంతో మైదానం వీడింది. గాయం తీవ్రతతో ఎక్కువగా ఉండటంతో ప్రతీకా బ్యాటింగ్‎కు కూడా దిగలేదు. దీంతో అమన్ జోత్ కౌర్‎తో కలిసి ఓపెనర్ స్మృతి మందాన ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతీకా గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. 

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ ప్రతీకా రావల్ మోకాలికి, చీలమండలానికి గాయమైందని తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం ఆమెను నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించింది. ఇండియాకు సెమీస్‎కు వెళ్లాలంటే కీలకమైన మ్యాచులో న్యూజిలాండ్‎పై భారీ సెంచరీతో చెలరేగింది ప్రతీకా. బ్యాటింగ్‎తో పాటు బౌలింగ్‎లోనూ రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.

టోర్నీలో మంచి ఫామ్‎లో ఉన్న ప్రతీకా కీలకమైన సెమీస్ ముందు గాయపడటం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. కాగా, భారత్ వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‎లో టీమిండియా సెమీస్‎కు చేరిన విషయం తెలిసిందే. లీగ్ దశలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‎తో నామామాత్రపు మ్యాచ్ ఆడుతోంది.