వర్షాకాలంలో.. మీ కారును కాపాడుకోండి ఇలా..

వర్షాకాలంలో.. మీ కారును కాపాడుకోండి ఇలా..

బీమా యాడ్-ఆన్‌‌‌‌లతో వెహికల్​ భద్రం

వెలుగు బిజినెస్​డెస్క్​: వర్షాకాలం వస్తే కార్ల యజమానుల్లో టెన్షన్​ మొదలవుతుంది. వరదలు, గతుకుల రోడ్లు,  ప్రమాదాల వంటి  సవాళ్లు ఎదురవుతాయి. భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం భారీ వర్షాలను అంచనా వేసింది. ప్రత్యేకంగా వర్షకాలం కోసం రూపొందించిన కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌‌‌‌లతో మీ వాహనాన్ని రక్షించుకోవడం చాలా కీలకం. వీటిలో ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్టర్, అసిస్టెన్స్ కవర్, ఫ్లడ్ అసిస్టెన్స్ కవర్, ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్  వినియోగ వస్తువుల కవర్ ఉన్నాయి. ఈ వర్షాకాలంలో ఈ యాడ్-ఆన్‌‌‌‌లు మీ కారుకు సమగ్ర ప్రొటెక్షన్​ను ఎలా అందిస్తాయో చూద్దాం..

ఇంజిన్ ప్రొటెక్షన్​ కవర్

వర్షాకాలంలో కారు ఇంజిన్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. వరదలు, లిక్విడ్​లీక్‌‌‌‌ల సమయంలో డ్రైవింగ్ చేయడం లేదా మునిగిపోయిన తర్వాత ఇంజిన్‌‌‌‌ను స్టార్ట్​ చేయడం వల్ల ఇంజిన్‌‌‌‌లోకి నీరు ప్రవేశించవచ్చు. ఇలాంటి సమయంలో ఖరీదైన రిపేర్లు అవసరమవుతాయి. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ ఇలాంటి నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. రిపేర్​ లేదా రిప్లేస్​మెంట్​ ఖర్చులను కవర్ చేస్తుంది.   టైర్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కూడా తీసుకుంటే మొత్తం లేబర్ ఛార్జీలను భరిస్తుంది.  పాడైన టైర్లు పగిలినా లేదా పంక్చర్ అయినా వాటి రీప్లేస్‌‌‌‌మెంట్ ఖర్చులను కవర్ చేస్తుంది.  

జీరో డిప్రిసియేషన్​ కవర్

స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు తరచుగా డిప్రిసియేషన్​(తరుగుదల) కారణంగా క్లెయిమ్ మొత్తంలో 30 నుంచి 50 శాతం వరకు తొలగిస్తాయి. మరమ్మతులకు పాక్షిక పరిహారం అందిస్తాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే వర్షాకాలంలో జీరో-తరుగుదల కవరేజ్ చాలా ముఖ్యమైనది. ఇది ప్లాస్టిక్, రబ్బరు  మెటల్ వంటి భాగాలకు తరుగుదల తగ్గింపులు లేకుండా మొత్తం క్లెయిమ్ మొత్తాన్ని మీకు అందిస్తుంది.  

అసిస్టెన్స్​ కవర్

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం లేదా నీరు పేరుకుపోయినప్పుడు కారుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సమయాల్లో అసిస్టెన్స్​ కవర్ 24/7 అత్యవసర మద్దతును అందిస్తుంది, టోయింగ్, ఆన్-సైట్ మరమ్మతులు, చిన్న పరిష్కారాలు, పెట్రోల్​/డీజిల్​ డెలివరీ వంటి సేవలు పొందవచ్చు. ఉదాహరణకు, మీ కారు నీటితో నిండిన ప్రదేశంలో నిలిచిపోయినట్లయితే, టోయింగ్​సేవలు పొందవచ్చు. వరద సహాయ కవర్ మీ వాహనం వరద నీటిలో మునిగి ఉంటే, కవర్ ఎండబెట్టడం,  శుభ్రపరిచే సేవలను అందిస్తుంది. కారు కదలలేని సందర్భాల్లో, ఇది సమీపంలోని గ్యారేజీకి తీసుకువెళ్లే సేవలను కూడా అందిస్తుంది.

ఈఎంఐ ప్రొటెక్షన్​ కవర్

మీ కారు ప్రమాదవశాత్తూ డ్యామేజ్‌‌‌‌ల కారణంగా వరుసగా 21 రోజులకు పైగా మరమ్మతులకు గురై, నిరుపయోగంగా ఉంటే, ఈఎంఐ ప్రొటెక్షన్​ యాడ్-ఆన్ మీ కారు ఈఎంఐలను కవర్ చేస్తుంది, వాటిని ఫైనాన్సర్‌‌‌‌కు చెల్లిస్తుంది. 

కన్జూమబుల్​ కవర్

వర్షాకాలంలో తరచుగా ఇంజన్ ఆయిల్, నట్స్  బోల్ట్‌‌‌‌లు, లూబ్రికెంట్లు  బ్రేక్ ఆయిల్ వంటివి అవసరమవుతాయి. కన్జూమబుల్​ కవర్ ఉంటే వీటిని ఉచితంగా మారుస్తారు. ఇది మీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో కఠినమైన పరిస్థితుల కారణంగా మరమ్మతులు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఉపయోగపడుతుంది.