టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం ఆదేశం

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో త్వరలో జరిగే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన లీకేజీలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. సాఫీగా పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎగ్జామ్స్ టైమ్​లో స్టూడెంట్లు ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా చూడాలని సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో విద్యాశాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పబ్లిక్ పరీక్షల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దీంతో పాటు రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కేవలం 420 మాత్రమే సర్కారు జూనియర్ కాలేజీలుండగా, ఇంకా ఎక్కడెక్కడ కాలేజీలు అవసరమో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.  అవసరమైన చోట బాలికల కోసం ప్రత్యేక కాలేజీలు పెట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం సెక్రటరీ శేషాద్రి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.