టెన్త్ ఎగ్జామ్స్ మే 20 నుంచి

టెన్త్ ఎగ్జామ్స్ మే 20 నుంచి

ఈసారి ఆరు పేపర్లే

89 రోజులు ఫిజికల్ క్లాసులు

సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రపోజల్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో టెన్త్ పబ్లిక్​ఎగ్జామ్స్ మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తెల్లారి నుంచే పదో తరగతి ఎగ్జామ్స్ నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది. వీటికి తోడు ఈసారి 89 రోజులు ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వీటన్నింటికీ సంబంధించిన ప్రతిపాదనలను రెండ్రోజుల క్రితమే సర్కారుకు పంపించింది. రాష్ట్రంలో మొత్తం ఐదున్నర లక్షల మంది పదో తరగతి చదువుతున్నారు.

ప్రస్తుతం టెన్త్​లో హిందీ సబ్జెక్టుకు ఒకే పేపర్ ఉండగా, మిగిలిన ఐదు సబ్జెక్టులకు రెండేసీ పేపర్లు ఉన్నాయి . దీంతో స్టూడెంట్లు ఏటా11 ఎగ్జామ్స్ రాస్తున్నారు . అయితే ఈ ఏడాది మాత్రం ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఎగ్జామ్స్‌ పెట్టాలని నిర్ణయించడంతో.. స్టూడెంట్లపై కొంతమేరకు ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు .
మే 29 వరకు పరీక్షలు..
మే 3 నుంచి 19 వరకు ఇంటర్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తవుతాయి. దీంతో మే20 నుంచి టెన్త్ పరీక్షలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. మే 26 వరకు మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తి చేసి.. 27, 28 తేదీల్లో ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ రెండు పేపర్లు, 29న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు ఎగ్జామ్ పెట్టాలని అధికారులు ప్రపోజల్స్ రెడీ చేశారు. అయితే ఈ టైమ్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో… అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయమే పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎగ్జామ్స్ విధానంపై ఎస్సీఈఆర్టీ అధికారులు కసరత్తు చేస్తున్నారు . క్వశ్చన్స్ చాయిస్ ఎలా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు . ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానుండగా, మొత్తం 89 రోజుల పాటు క్లాసులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన మే 29 వరకు అకడమిక్ ఇయర్ కొనసాగనుంది. రెండో శనివారం పని దినంగానే కొనసాగించాలని ముందుగా భావించినా, టీచర్ల సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో ఆ నిరయ్ణంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.