
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో మరో మార్పునకు సర్కారు రెడీ అవుతోంది. రెండేండ్ల నుంచి ఒకే రోజు చేపడుతున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల సర్కారుకు ఎస్సీఈఆర్టీ అధికారులు పంపించారు. దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉంది. రెండేండ్ల కిందట 11 పేపర్లతో టెన్త్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో 2021– 2022 ఏడాదిలో ఆరు పేపర్లకు కుదిస్తూ అప్పటి సర్కారు ఉత్తర్వులిచ్చింది.
ఆ తర్వాతి 2022 – 2023 విద్యాసంవత్సరం నుంచి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఫిజిక్స్, బయోలజీ క్వశ్చన్ పేపర్లను మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని పేరెంట్స్, స్టూడెంట్ల నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు వేర్వేరు రోజుల్లో బయోలజీ, ఫిజిక్స్ పేపర్లు పెట్టాలనే ప్రతిపాదనలను ఇటీవల సర్కారుకు పంపించారు. అయితే, ఎగ్జామ్ వేర్వేరు రోజుల్లో నిర్వహించినా మార్కులు మాత్రం సైన్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారని అధికారులు చెప్తున్నారు.
దీంతో స్టూడెంట్లకు టెన్షన్ తగ్గి, సైన్స్ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేందుకు మరింత టైమ్ దొరికే అవకాశం ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచే అధికారులు ఆరు సబ్జెక్టులకు చెందిన పేపర్లను ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.