
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ప్రతిపాదించిన జీఎస్‌టీ మినహాయింపుతో టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే కంపెనీలతోపాటు కొనుగోలుదారులకూ మేలేనని పన్ను నిపుణులు తెలిపారు. ప్రభుత్వం 18శాతం జీఎస్‌టీని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించగా, రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం కూడా దీనికి మద్దతు ఇచ్చింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం పాలసీదారులకు చేరాలంటే ప్రత్యేక మెకానిజం అవసరమని సూచించింది.
కమీషన్, రీ-ఇన్సూరెన్స్ వంటి కీలక సేవలపై కూడా మినహాయింపు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. లేకపోతే ఐటీసీ (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్) కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాయి. హెల్త్, యులిప్ వంటి చాలా పాలసీలు ఉన్నాయి. కొన్ని పాలసీల్లో కొంత ప్రీమియం పెట్టుబడులకు, మరికొంత రిస్క్ కవరేజ్‌కి వెళుతోంది. జీఎస్‌టీ కేవలం రిస్క్ కవరేజ్ పోర్షన్‌పైనే పడుతోంది. దీంతో తాజాగా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినా, యులిప్ వంటి పాలసీల కంటే టర్మ్, హెల్త్ పాలసీలు ఎక్కువగా లాభపడతాయని నిపుణులు పేర్కొన్నారు.