జమ్మూలోబస్సుపై దాడి చేసింది మేమే

జమ్మూలోబస్సుపై దాడి చేసింది మేమే
  • లష్కరే తాయిబాకు చెందిన ఆర్టీఎఫ్  ప్రకటన

జమ్మూ: జమ్మూకాశ్మీర్​లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై దాడి చేసింది తామేనని పాకిస్తాన్​ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తాయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్(ఆర్టీఎఫ్) సోమవారం ప్రకటించుకుంది. బస్సుపై కాల్పులు జరిపింది తామేనని వెల్లడించింది. ఇది సరికొత్త ఆరంభమని పేర్కొంది. టూరిస్ట్​లు, నాన్​లోకల్స్ పై ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరించింది.

ఆదివారం జమ్మూలోని రియాసీ జిల్లా నుంచి ఖత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి 53 మంది యాత్రికులతో బయల్దేరిన బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 9 మంది ప్రాణాలు తీశారు. మిగతా 43 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో మరణించిన 9 మందిలో నలుగురు రాజస్థాన్​లోని ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, ముగ్గురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు రియాసి జిల్లాకు చెందినవారు. 

టెర్రరిస్టుల జాడ కోసం కూంబింగ్

టెర్రరిస్ట్​ల దాడి అనంతరం పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు రియాసి జిల్లాలోని స్పాట్​కు చేరుకున్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. స్థానిక పోలీసులతో కలిసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. టెర్రరిస్టులు దాక్కొని ఉండొచ్చనే అనుమానంతో పర్వత ప్రాంతాలలో సెక్యూరిటీ ఫోర్సెస్ కూంబింగ్ ముమ్మరం చేశాయి.

కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెర్రరిస్టుల దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.