పాక్, చైనాలకు జైశంకర్ వార్నింగ్

పాక్, చైనాలకు జైశంకర్ వార్నింగ్

యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగం 

న్యూయార్క్: ‘‘ఐక్యరాజ్యసమితిలో టెర్రరిస్టులపై ఆంక్షలు విధించే చట్టంపై రాజకీయం చేస్తూ.. టెర్రరిస్టులను కాపాడితే మీరు కూడా ప్రమాదంలో పడతారు” అని పాకిస్తాన్, చైనాలను మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. శనివారం యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టెర్రరిజం విషయంలో పాక్, చైనాల తీరును తప్పు పడుతూ గట్టి మెసేజ్ ఇచ్చారు. ఇండియా మాత్రం టెర్రరిజంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టులను అధికారికంగా టెర్రరిస్టులుగా ప్రకటించే ప్రతిపాదనలను పాక్, చైనా తరచూ వ్యతిరేకిస్తున్నాయి. చైనా తన వీటో అధికారంతో పాక్ టెర్రరిస్టులను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో టెర్రరిజంపై ఆ రెండు దేశాల తీరును జైశంకర్ ఎండగట్టారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇండియా కీలకంగా మారిందని, ప్రధానంగా దక్షిణ దేశాల (గ్లోబల్ సౌత్)కు గొంతుకలా మారిందని జైశంకర్ అన్నారు. 

రష్యా విదేశాంగ మంత్రితో భేటీ

రష్యా వివిధ రంగాల్లో ఇండియాకు ప్రధాన భాగస్వామి అని జైశంకర్ అన్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం న్యూయార్క్ లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం, జీ20, ఐక్యరాజ్యసమితిలో రిఫామ్స్ వంటి అంశాలపై తాము చర్చించినట్లు తెలిపారు. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కు ఇండియా, బ్రెజిల్ తగిన దేశాలని సెర్గీ లావ్ రోవ్ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మద్దతు పలికారు.