T20 World Cup 2024: ఒకేసారి వేలమందిని మట్టుపెట్టేలా ప్లాన్.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!

T20 World Cup 2024: ఒకేసారి వేలమందిని మట్టుపెట్టేలా ప్లాన్.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా జూన్ 9న జరగాల్సిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు నివేదికలు వస్తున్నాయి. హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ కావడంతో దాదాపు 30 నుంచి 40 మంది ప్రేక్షకులు హాజరయ్యే  అవకాశం ఉంది. దీంతో ముష్కరులు ఈ మ్యా‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఆత్మాహుతి దాడులకు దిగొచ్చని హెచ్చరించింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశాయి. 

భద్రత పెంచాలని గవర్నర్ ఆదేశాలు

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భారత జట్టువే మూడు మ్యాచ్‌లు. అంతేకాదు, జూన్ 1న భారత్- బంగ్లాదేశ్‌ మధ్య జరగనున్న వార్మప్ మ్యాచ్ వేదిక కూడా ఇదే. దీంతో నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం భద్రత పెంచాల్సిందిగా న్యూయార్క్‌ గవర్నర్ కాథీ హోచుల్ పోలీసులను ఆదేశించారు. ఉగ్ర ముప్పును ధృవీకరించడానికి అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించనప్పటికీ, భారత్ - పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్‌కు భద్రతను పెంచాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. "ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. ఫెడరల్​ ఏజెన్సీలతో మా బృందాలు కొన్ని నెలలుగా పనిచేస్తున్నాయి.." అని కాథీ చెప్పుకొచ్చారు.

 ఆత్మాహుతి దాడి

ఈ ముప్పుపై నసావు కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్లేక్‌మాన్, పోలీస్ కమీషనర్ పాట్రిక్ రైడర్ మాట్లాడుతూ.. భారత్‌- పాక్‌ మ్యాచ్ సందర్భంగా ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో సామూహిక హత్యాయత్నానికి పాల్పడే 'ఒంటరి తోడేలు దాడి' చేయొచ్చని ప్రస్తావించారు. అంటే ఒంటికి బాంబులు అమర్చుకొని ఆత్మాహుతి దాడులకు దిగొచ్చన్నది వారి అనుమానం. డ్రోన్​ ద్వారా కూడా దాడులు చేసే అవకాశం ఉన్నందున.. మ్యాచ్​ జరుగుతున్న ప్రాంతంలో నో ఫ్లై జోన్​ని ప్రకటించారు అధికారులు. అంతేకాదు, 'ఐసిస్‌' అండతో రెచ్చిపోతున్న ఓ ఉగ్ర ముఠా ఆన్‌లైన్‌ వేదికగా హెచ్చరికలు పంపింది. 'మీరు మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు.. మేము మీకోసం ఎదురుచూస్తున్నాం.." అని ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటో షేర్‌ చేసింది. అందులో 'నసావు స్టేడియం.. 09/06/2024..' అని రాసి ఉండటం ఆందోళనకు దారితీస్తోంది. 

నసావు క్రికెట్ స్టేడియం మ్యాచ్‌ల షెడ్యూల్

  • జూన్ 03 (సోమవారం): శ్రీలంక vs  దక్షిణాఫ్రికా
  • జూన్ 05, బుధవారం): భారత్  vs ఐర్లాండ్
  • జూన్ 07 (శుక్రవారం): కెనడా vs ఐర్లాండ్
  • జూన్ 08 (శనివారం): నెదర్లాండ్స్ vs దక్షిణాఫ్రికా 
  • జూన్ 09 (ఆదివారం): భారత్ vs పాకిస్తాన్
  • జూన్ 10 (సోమవారం): దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్
  • జూన్ 11(మంగళవారం): పాకిస్థాన్ vs కెనడా
  • జూన్ 12 (బుధవారం): భారత్ vs అమెరికా