జమ్మూ కాశ్మీర్ జైళ్లపై దాడులకు టెర్రరిస్టుల ప్లాన్ .. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రత పెంపు

జమ్మూ కాశ్మీర్ జైళ్లపై దాడులకు టెర్రరిస్టుల ప్లాన్ .. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రత పెంపు
  • ఎల్​వోసీలో భారీ డంప్​ స్వాధీనం

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్​లో ఉన్న జైళ్లపై దాడులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.  శ్రీనగర్ లోని సెంట్రల్ జైల్, జమ్మూలోని కోట్ బల్వాల్ జైల్​ను టార్గెట్ చేసినట్లు సమాచారం. హై ప్రొఫైల్ టెర్రరిస్టులు, స్లీపర్ సెల్ మెంబర్లు ఈ జైల్లోనే ఉన్నారు. వీరిని విడిపించుకునేందుకే టెర్రరిస్టులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జైళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. పరిస్థితులను బట్టి జైళ్లల్లో ఉన్న టెర్రరిస్టులను విడిపించుకోవడం లేదంటే మట్టుబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాడుల్లో డైరెక్ట్​గా వీరి పాత్ర లేకపోయినప్పటికీ.. టెర్రరిస్టులకు షెల్టర్, ఆయుధాలు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 

పహల్గాం టెర్రరిస్ట్​లకు పాక్​ ఆర్మీ శిక్షణ

పహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్ స్పెషల్  సర్వీసెస్ గ్రూప్ వీరికి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్​లో ఎలా దాడులు చేయాలి? తక్కువ టైమ్​లో ఎక్కువ మందిని ఎలా చంపాలి? బ్యాకప్ ప్లాన్ గురించి పాక్ ఆర్మీ టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పటికే జైల్లో ఉన్న పలువురు టెర్రరిస్టులను ఎన్ఐఏ అధికారులు విచారించగా.. ఈ విషయం తెలిసింది. పహల్గాంలో దాడికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టుల్లో ఒకడైన హషీం మూసా.. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ పారా కమాండోగా పని చేశాడు. తర్వాత లష్కరే తాయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్​లో జాయిన్ అయి పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. 

2023లోనే మూసా ఇండియాలో అడుగుపెట్టాడు. మరికొంత మంది టెర్రరిస్టులకు మూసానే.. యుద్ధ వ్యూహాలు, పర్వత ప్రాంతాల్లో దాడులు, క్లోజ్ క్వార్టర్స్ యుద్ధం, తప్పించుకోవడంపై ట్రైనింగ్ ఇచ్చాడు. మూసా ఇంకా సౌత్ కాశ్మీర్​లోని అటవీ ప్రాంతంలోనే దాక్కున్నట్లు సెక్యూరిటీ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అతడి కోసం అడవిని జల్లెడ పడ్తున్నాయి. మూసాను పట్టిస్తే రూ.20 లక్షలు ఇస్తామని జమ్మూ పోలీసులు కూడా ఇప్పటికే ప్రకటించారు.

ఎల్​వోసీ వెంట భారీ డంప్ స్వాధీనం

ఎల్​వోసీ వద్ద టెర్రరిస్టులు దాచిపెట్టిన ఆయుధాల డంప్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పూంచ్ జిల్లా సూరన్​కోట్ ఏరియాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట పోలీసులు, ఆర్మీ జవాన్లు జాయింట్​గా రొటీన్ పెట్రోలింగ్ చేపట్టారు. ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు దాచిన డంప్​ను గుర్తించారు. 5 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 2 ఐఈడీలు స్టీల్ బకెట్లలో, 3 ఐఈడీలు టిఫిన్ బాక్సుల్లో ఫిట్ చేసి ఉంచారు. 2 వైర్‌‌‌‌లెస్ రేడియో సెట్లు, ఒక బైనాక్యులర్, 3 టోపీలు, 3 బ్లాంకెట్లు, ఐదు యూరియా ప్యాకెట్లు, 5 కిలోల గ్యాస్ సిలిండర్, కొన్ని బట్టలు, వంట సామాగ్రి దొరికాయి. ఐడీలను నిర్వీర్యం చేశారు. భారీ దాడికి టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు ఈ డంప్ ద్వారా తెలుస్తున్నది.