ఎలన్ మస్క్ షాక్ : టెస్లాలో 10 శాతం మంది ఉద్యోగుల తీసివేత

ఎలన్ మస్క్ షాక్ : టెస్లాలో 10 శాతం మంది ఉద్యోగుల తీసివేత

ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న టెస్లా కంపెనీ 10 శాతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఖర్చు తగ్గింపు, ఉత్పాదకత పెంచడం కోసం కంపెనీ ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఇంటర్నల్ మెమోలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించినట్లు కంపెనీ నివేదకలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా తొలగించే ఉద్యోగుల లిస్టును తయారు చేయాలని, కొంతమంది ఉద్యోగుల స్టాక్ రివార్డులను పాజ్ చేసినట్లు నివేదికలో వెల్లడించింది. 

డిసెంబర్ 2023 నాటికి టెస్లా ప్రపంచవ్యాప్తంగా లక్షా 40 వేల 473 మంది ఉద్యోగులను కలిగి ఉంది. తాజా టెస్లా లేఆఫ్ లో దాదాపు 15వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. 

2024 మొదటి త్రైమాసికంలో టెస్లా తన వెహికల్ అమ్మకాల్లో భారీగా తగ్గుదలను చూసింది. గత నాలుగేళ్లలో ఇంత తక్కువ అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. ఈ మార్పుతో టెస్లా తక్కువ ధరలో కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. 

సోమవారం (ఏప్రిల్ 15)  ప్రీ మార్కెట్ లో టెస్లా షేర్లు  0.6 శాతం తగ్గుదలను చవిచూశాయి. గత సంవత్సరం రాపిడ్ సేల్స్ లో గణనీయమైన వృద్ధిని సాధించిన టెస్లా.. 2024లో అమ్మకాల్లో మందగమనం కొనసాగుతుందని అంచనా వేస్తోంది. టెస్లా దాని ప్రస్తుత మోడళ్లను ఆలస్యంగా అప్ డేట్ చేయడం, అధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తోంది. ఈ కారణాలతో  టెస్లా కంపెనీ ఉద్యోగుల్లో కోతకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.