ఇలా చేస్తే 'కీ' మరచిపోరిక....

ఇలా చేస్తే 'కీ' మరచిపోరిక....

ఇల్లు, కారు లాంటి వాటి తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతుండడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. పెట్టేటప్పుడు పెట్టేస్తాం.. కానీ తీరా వాటి ఉపయోగం వచ్చేసరికి కంటికి కనిపించవు. దాని వల్ల సమయం వృథా కావడమే కాకుండా... చిరాకు కూడా వచ్చేస్తోంది. అలాంటి పరిణామాలకు చెక్ పెట్టేందుకు టెస్లా యజమాని బ్రాండన్ డలాలీ చేసిన ఈ పని అందర్నీ ఆకర్షిస్తోంది. తాళాలను మళ్లీ మళ్లీ మర్చిపోకుండా ఉండేందుకు ఆయన ఓ పరిష్కారం కనుగొన్నాడు. అదేంటంటే.. తాను ఎక్కడికెళ్లినా వెంటే ఉండేలా.. ఆ 'కీ'ని తన శరీరంలోకి జొప్పించుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాడు.

తన కారు లాక్ ను ఓపెన్ చేసేందుకు ఓ చిప్ ను తన చేతిలో అమర్చుకున్నాడు బ్రాండన్. దీని కోసం ఆయన ఓ ప్రొఫెషనల్ ద్వారా దాదాపు రూ.32 వేలు ఖర్చు చేసి ఈ వివో కీ అపెక్స్ ను చేతిలోకి జొప్పించుకున్నాడు. అతను అమర్చుకున్న చిప్ పూర్తిగా కాంటాక్ట్ లెస్ కావడంతో సెన్సార్ సాయంతో కారు తలుపు ఓపెన్ కావడాన్ని బ్రాండన్ షేర్ చేసిన వీడియోను చూస్తే తెలుస్తోంది. ఈ వివో కీ అపెక్స్ చిప్ ఆపిల్ పే టెక్నాలజీ తరహాలోనే పని చేయనున్నట్టు తెలుస్తోంది.  ఈ సందర్భంగా `నా ఇంటి కీ నా ఎడమ చేతిలో, నా కారు కీ నా కుడి చేతిలో ఉండాలనేది నా ఆలోచన` అని బ్రాండన్ తెలిపాడు. దీనికి సంబంధించిన  వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.