ఖాళీగా టెస్టింగ్, వ్యాక్సిన్ సెంటర్లు

ఖాళీగా టెస్టింగ్, వ్యాక్సిన్ సెంటర్లు
  • లాక్ డౌన్​ ఎఫెక్ట్​తో వెళ్లని ప్రజలు 
  • ఫస్ట్ డోస్​ మెసేజ్ చూపిస్తే అనుమతిస్తున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ ఎఫెక్ట్​తో కరోనా టెస్టులు, వ్యాక్సిన్ సెంటర్ల వద్ద బుధవారం జనం కనిపించలేదు. మొన్నటి వరకు టెస్టులు, వ్యాక్సిన్​ కోసం వందలాది మందితో భారీ క్యూలైన్లు కనిపించినప్పటికీ లాక్​ డౌన్​తో ఎక్కువ సంఖ్యలో రాలేదు. టెస్టులు చేస్తారో లేదో, వ్యాక్సిన్ వేస్తారోలేదోనన్న అనుమానంతో చాలా మంది సెంటర్లకు రాలేదు. ఒకవేళ బయటకు వస్తే పోలీసులు ఏం అడుగుతారో తెలియక చాలా మంది వ్యాక్సిన్ కోసం వెళ్లలేదు. మెహిదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో లాక్ డౌన్​కు ముందు వరకు వ్యాక్సిన్ కోసం ప్రతిరోజు 200 మందికిపైగా వచ్చేవారు. 150 మందికి పైగా కరోనా టెస్టులు చేసేవారు. కానీ బుధవారం వ్యాక్సిన్, టెస్టుల కోసం ఇక్కడకు పదుల సంఖ్యలోనే వచ్చారు. దాదాపు సిట్టిలోని అన్ని సెంటర్ల దగ్గర ఇలాంటి పరిస్థితే కనిపించింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారి సంఖ్య లాక్ డౌన్​తో ఒక్కసారిగా 50 శాతం తగ్గింది. హైదరాబాద్ జిల్లాలోని 135 సెంటర్లలో మంగళవారం 15,716 మంది వ్యాక్సిన్​ తీసుకోగా, బుధవారం 8,164 మంది మాత్రమే తీసుకున్నారు.

టెస్ట్, వ్యాక్సిన్ కోసం వెళ్లొచ్చు
ఫస్ట్ డోస్ తీసుకున్న మెసేజ్ లేదా ఆన్​లైన్​లో డౌన్​లోడ్ చేసిన సర్టిఫికెట్ చూపిస్తే సెకండ్ డోస్ కోసం వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారు. లాక్​డౌన్ ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు, టెస్టులు చేయించుకునేందుకు జనం భయపడకుండా సెంటర్లకు రావాలని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. సిటీలో 41 సెంటర్లలో కొవాగ్జిన్​, 94 సెంటర్లలో కొవిషీల్డ్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.