బర్డ్ ఫ్లూతో అలర్ట్ కోళ్లకు టెస్టులు.. రంగంలోకి 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్

బర్డ్ ఫ్లూతో అలర్ట్ కోళ్లకు టెస్టులు.. రంగంలోకి 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్

 

  • బర్డ్​ఫ్లూ అలర్ట్​తో రంగంలోకి 1,300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఫామ్​లో కోళ్లను పరిశీలిస్తున్న వెటర్నరీ స్టాఫ్
  • అనుమానం వస్తే హైదరాబాద్​కు బ్లడ్ ​శాంపిల్స్
  • ఇప్పటివరకు ఎక్కడా బర్డ్​ఫ్లూ ఆనవాళ్లు లేవన్న డాక్టర్స్
  • ఎగ్స్, చికెన్ ఎప్పట్లానే తినొచ్చని వెల్లడి

వెలుగు, నెట్​వర్క్: పలు రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ వ్యాప్తి చెందుతుండటం, మన రాష్ట్రంలోనూ అక్కడక్కడా కోళ్లు, నెమళ్లు, ఇతర పక్షులు చనిపోతున్నాయనే వార్తలతో రాష్ట్ర సర్కారు అలర్ట్ అయింది. స్టేట్​వైడ్ 1,300 బర్డ్​ఫ్లూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. వెటర్నరీ డాక్టర్లు, స్టాఫ్​తో కూడిన ఈ టీమ్స్ సోమవారం నుంచే అన్ని జిల్లాల్లో రంగంలోకి దిగాయి. కొన్నిచోట్ల ఫారెస్ట్​ స్టాఫ్​ కూడా ఈ టీమ్స్​తో కలిసి.. లేయర్, బాయిలర్ అనే తేడా లేకుండా ప్రతిఫామ్​కు వెళ్లి కోళ్లను పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన కోళ్ల బ్లడ్​ శాంపిల్స్ తీసి హైదరాబాద్​లోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​కు పంపిస్తున్నారు. స్టేట్​లో ఇప్పటిదాకా ఎక్కడా బర్డ్​ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదని, ఎగ్స్, చికెన్ తినవచ్చని డాక్టర్స్ ​సూచిస్తున్నారు.

12 వేల కోళ్ల ఫామ్స్

ఎగ్స్, చికెన్ ఎక్కువగా తినే మన రాష్ట్రంలో పౌల్ట్రీ అతి పెద్ద ఇండస్ట్రీగా ఉంది. రాష్ట్రంలో 2 వేలకు పైగా లేయర్ ​ఫామ్స్, సుమారు 10 వేల వరకు బాయిలర్ ఫామ్స్ ఉన్నాయి. అధికారులు ప్రతి జిల్లాలో 20 దాకా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. టీమ్ మెంబర్లు తమ పరిధిలోని ప్రతి కోళ్ల ఫామ్​కు వెళ్లి ఓనర్లు, వర్కర్లను అన్ని రకాలుగా ఆరా తీస్తున్నారు. ఈ మధ్య పెద్దసంఖ్యలో కోళ్లు చనిపోయాయా అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నారు. ఎలాంటి అనుమానం కలిగినా కోళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం హైదరాబాద్ పంపుతున్నారు.

మన కోళ్లలో బర్డ్​ ఫ్లూ లక్షణాలు లేవు

సోమవారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పరిశీలనలో  కోళ్లలో ఫ్లూ లక్షణాలు కనిపించలేదని ఆఫీసర్లు చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ బోర్డర్ జిల్లాల్లోని ఆఫీసర్లు అలర్టయ్యారు. వేరే ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

  • సిద్దిపేటలో అత్యధికంగా 300కు పైగా కోళ్ల ఫామ్స్​ఉన్నాయి. 90 లక్షలకు పైగా కోళ్లు ఉండడంతో 24 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాకా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు.
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 90 శాంపిల్స్​సేకరించారు. అందులో 50 కయాకల్, 40 బ్లడ్ సీరం టెస్టులు చేస్తామని ఆఫీసర్లు తెలిపారు.
  • నిర్మల్ జిల్లా బాసరలో 20 దేశీ కోళ్లు చనిపోవడంతో అధికారులు బ్లడ్ సీరమ్ నమూనాలను హైదరాబాద్ పంపారు. ఇక్కడ 10 లక్షల దేశీ కోళ్లు ఉండగా,18 టీంలతో చెక్ చేస్తున్నారు.
  •  ఆసిఫాబాద్ జిల్లాలో 4 లక్షలకుపైగా నాటుకోళ్లు ఉన్నాయి. 15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు సోమవారం జైనూర్, సిర్పూర్ మండలాల్లో పరిశీలించాయి. ఎక్కడా బర్డ్​ఫ్లూ లక్షణాలు కనిపించలేదు.
  • కరీంనగర్ జిల్లాలో లేయర్, బాయిలర్ కలిపి  20 లక్షల కోళ్లున్నాయి.16 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్.. 86 శాంపిల్స్ ను హైదరాబాద్​కు పంపాయి.
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్స్​ను చెక్​చేస్తున్నారు. బర్డ్​ఫ్లూ వదంతుల నేపథ్యంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు, వెటర్నరీ డాక్టర్లు పాకాల అడవిని సందర్శించారు. కాకులు, కొంగలు, పక్షులను పరిశీలించారు. ఇప్పటివరకు పక్షులేవీ చనిపోలేదని చెప్పారు.
  • వనపర్తి జిల్లా కొత్తకోటలోని ఓ నాటుకోళ్ల ఫామ్​లో వారం రోజులుగా బర్డ్స్​చనిపోతుండటంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే అవి కొక్కెర వ్యాధితో చనిపోయినట్లు వెటర్నరీ డాక్టర్లు తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

టెన్షన్​లో పౌల్ట్రీ ఇండస్ట్రీ

బర్డ్​ఫ్లూపై వదంతులు వ్యాపిస్తే పౌల్ట్రీకి తీవ్ర నష్టం జరుగుతుంది. కరోనా తొలినాళ్లలోనూ ఎగ్స్, చికెన్ అమ్మకాలు పడిపోయి కోళ్ల పరిశ్రమ బాగా విధంగా దెబ్బతింది. తాజాగా బర్డ్​ఫ్లూ ప్రచారంతో  పౌల్ట్రీ యజమానులు, రైతులు, ఏజెన్సీలు, చికెన్, ఎగ్ ​సెంటర్స్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు.

ఇవీ లక్షణాలు

వైరస్ సోకిన కోళ్ల ఈకలు చిందర వందర అవుతాయి. ముక్కు నుంచి సొంగ కారుతూ ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. కోళ్ల శరీర భాగా లు దెబ్బతిని 48 గంటల్లో చనిపోతా యి. వీటి మధ్య తిరిగే వర్కర్లకు ఫ్లూ సోకే ప్రమాదం ఉంటుంది. బర్డ్​ఫ్లూ సోకిన వాళ్లకు జలుబు, దగ్గు, జ్వరం, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. పక్షుల నుంచి మనుషుల కు వస్తుందని.. మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. కోళ్ల ఫామ్స్​లో వర్కర్లు మాస్కులు పెట్టుకోవాలంటున్నారు.

చికెన్, గుడ్లను తినొచ్చు

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఇప్పటి వరకు ఎక్కడా వ్యాప్తి చెందలేదు. దీని గురించి ఎలాంటి భయాందోళన అవసరం లేదు. చికెన్, గుడ్లను ఎప్పట్లాగే తినొచ్చు. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద ఈ వైరస్ చనిపోతుంది. దాదాపు100 డిగ్రీ సెంటీగ్రేడ్​ వద్ద మనం చికెన్, ఎగ్స్​ను ఉడికిస్తాం. కాబట్టి బర్డ్​ఫ్లూ వచ్చే ప్రమాదమే లేదు. ఎక్కడైనా కాకులు, కొంగలు, ఇతర పక్షులు పెద్ద సంఖ్యలో చనిపోతే వాటిని ఎవరూ ముట్టుకోకుండా వెటర్నరీ డిపార్ట్​మెంట్​కు సమాచారం ఇవ్వాలి.

– డాక్టర్ వి.కృష్ణ, వెటర్నరీ ఆఫీసర్, యాదాద్రి