టెట్ ఎగ్జామ్స్ షురూ..  తొలిరోజు 7,640 మంది డుమ్మా 

టెట్ ఎగ్జామ్స్ షురూ..  తొలిరోజు 7,640 మంది డుమ్మా 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. రెండు షిఫ్టుల్లో 34,436 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 26,796 మంది అటెండ్ అయ్యారు. వివిధ కారణాలతో 7,640 మంది హాజరు కాలేదు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఎగ్జామ్ సెషన్ లో 76.08% మంది హాజరయ్యారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు జరిగిన ఆఫ్టర్ నూన్ సెషన్​లో 79.55% మంది పరీక్ష రాశారు. తొలిరోజు జరిగిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ పేపర్ మాములుగానే వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. కొత్త పాఠ్యపుస్తకాల నుంచే ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయని తెలిపారు. తెలుగు సబ్జెక్టులో గ్రామర్, కవుల గురించి ఎక్కువ క్వశ్చన్లు అడిగారు.

సైకాలజీలో క్వశ్చన్లు ఈజీగానే ఉండగా, ఇంగ్లిష్ లో కొంత కఠినంగా ఇచ్చినట్టు అభ్యర్థులు చెప్తున్నారు. అయితే, టీచర్ల ప్రమోషన్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో కొందరు దరఖాస్తు చేసిన టీచర్లు పరీక్షకు అటెండ్ కాలేదు.