ఇండియాకి వెళ్లిపొమ్మంటూ భారత మహిళలపై దాడి

ఇండియాకి వెళ్లిపొమ్మంటూ భారత మహిళలపై దాడి

అమెరికాలో జాతి వివక్ష మళ్లీ తెరపైకి వచ్చింది. నలుగురు భారతీయ మహిళలపై మెక్సికన్ అమెరికన్ మహిళ రెచ్చిపోయింది. జాత్యహంకార దూషణలతో దాడికి దిగింది. ఈ ఘటన  టెక్సాస్‌.. డల్లాస్‌లోని పార్కింగ్ స్థలంలో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన నలుగురు మహిళలను ఉద్దేశిస్తూ..  'ఐ హేట్ యూ ఇండియన్స్, గో బ్యాక్' అంటూ ఆమె దుర్భాషలాడింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. 

వైరల్ అవుతున్న వీడియోలో మహిళ మాట్లాడుతూ..  "నేను భారతీయులను ద్వేషిస్తున్నాను. ఈ భారతీయులందరూ మెరుగైన జీవితాన్ని కోరుకుంటారు.. కాబట్టి అమెరికాకు వచ్చారు. ఇండియాలో జీవితం చాలా గొప్పగా ఉంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు " అని మహిళ అన్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి..  తన అమ్మ, ఆమె ముగ్గురు స్నేహితులు కలిసి భోజనానికి వెళ్లగా ఇలా జరిగిందంటూ రాశాడు.  బాధితులు జాతిదూషణలు చేయవద్దని  ఆ మహిళను కోరుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 

అయితే ఈ ఘటన  పైన ప్రవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  భారతీయులు ఆమె పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరెస్ట్ చేసిన మహిళను ఎస్మెరాల్డా అప్టన్‌ గా గుర్తించిన పోలీసులు.. ఆమె వద్ద ఆ సమయంలో  తుపాకీ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్మెరాల్డా పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.