చేనేతలకు గుడ్ న్యూస్ : వస్త్ర పరిశ్రమకు కోటి చీరల ఆర్డర్..కోటి మంది మహిళలకు చీరలు ఇస్తాం

చేనేతలకు గుడ్ న్యూస్ : వస్త్ర పరిశ్రమకు కోటి చీరల ఆర్డర్..కోటి మంది మహిళలకు చీరలు ఇస్తాం
  • చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, విప్​ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్ ను అందజేసిందని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ శైలజా రామయ్యర్, విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  తెలిపారు. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కోటి చీరల ఆర్డర్  వివరాలను ప్రకటించారు.

 నూతన రంగుల చీరలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది 6.85 కోట్ల చీరలు ప్రభుత్వం ఆర్డర్  ఇచ్చిందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 130 మ్యాక్స్  సంఘాలతో పాటు కరీంనగర్  జిల్లా గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి 7 కోట్ల మీటర్ల ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్  ఇచ్చిందని చెప్పారు. కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వాలనేదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. 

వస్త్ర పరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. రూ.352 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఇందిర మహిళా శక్తి చీరలను నిబంధనల ప్రకారం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. గతంలో చీరల నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. సిరిసిల్లతో పాటు వివిధ ప్రాంతాల వస్త్ర పరిశ్రమ బాధ్యులు సొంతంగా చీరలు నేస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. లైబ్రరీ చైర్మన్  నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్  కమిటీ చైర్మన్లు స్వరూప, రాములు నాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర రావు, ఏడీ సంతోష్  పాల్గొన్నారు.