టీజీసెట్ ఫలితాలు రిలీజ్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

టీజీసెట్ ఫలితాలు రిలీజ్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీసెట్ ( బ్యాక్ లాగ్ )2026 ఫేజ్– 1 రిజల్ట్‌‌‌‌ను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రిలీజ్ చేశారు. 2026–-27 విద్యా సంవత్సరానికి  6వ తరగతి నుంచి 9వ  తరగతుల వరకు బ్యాక్‌‌‌‌లాగ్ ఖాళీల భర్తీతో పాటు పరిగి ఎక్స్‌‌‌‌లెన్స్ స్కూల్, ఖమ్మంలోని 9వ తరగతి సీట్ల ఫలితాలను విడుదల చేశారు. ఫేజ్–-1లో మొత్తం 6,242 సీట్లు భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 7 నుంచి 20 వరకు తమకు కేటాయించిన పాఠశాలల్లో ధ్రువపత్రాలు, రెండు పాస్‌‌‌‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని మంత్రి అడ్లురి సూచించారు. http://tgswreis.telangana.gov.in  లేదా  http://tgcet.cgg.gov.in లో రిజల్ట్స్ చూసుకోవాలని అధికారులు చెప్పారు. 

ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడారు. విద్యార్థుల అడ్మిషన్ ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీట్ల భర్తీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ స్థాయి విద్య, డిజిటల్ క్లాస్‌‌‌‌రూమ్స్, పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నట్టు వెల్లడించారు.