సైబర్ నేరగాళ్లకు హైదరాబాద్‌‌‌‌ అకౌంట్లు, సిమ్ కార్డులు ..కంబోడియా కేంద్రంగా మోసాలు

సైబర్ నేరగాళ్లకు హైదరాబాద్‌‌‌‌ అకౌంట్లు, సిమ్ కార్డులు ..కంబోడియా కేంద్రంగా మోసాలు
  •  
  • సప్లై చేస్తున్న నలుగురు సభ్యుల ముఠా అరెస్టు 
  • కంబోడియా కేంద్రంగా స్కామర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ మోసాలు
  • రూ.4.87 కోట్లు కొల్లగొట్టిన కేసులో సీఎస్‌‌‌‌బీ దర్యాప్తు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. వీరి నుంచి పది మొబైల్‌‌‌‌ ఫోన్లు, 10 బ్యాంక్ పాస్‌‌‌‌బుక్స్, 2 చెక్‌‌‌‌బుక్స్‌‌‌‌ 10 డెబిట్, క్రెడిట్‌‌‌‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అందించిన బ్యాంక్ అకౌంట్లతో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు కంబోడియా నుంచి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ వివరాలను సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

క్యాబ్ డ్రైవర్ల కరెంట్‌‌‌‌ అకౌంట్లు..

ఏపీలోని కడప జిల్లాకు చెందిన శివారెడ్డి(33) అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో నివాసం ఉంటున్నాడు. బ్యాంక్ అకౌంట్లను సేకరించి సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లకు సప్లై చేస్తున్నాడు. ఒక్కో అకౌంట్‌‌‌‌కు అతను రూ.1లక్ష కమీషన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే  కూకట్‌‌‌‌పల్లిలోని ప్రగతినగర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటున్న చిన్నం ఉగ్రనర్సింహులు(29) పరిచయం అయ్యాడు. నర్సింహులు క్యాబ్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. శివారెడ్డి సూచనల మేరకు రిటానా ప్రాపర్టీస్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ పేరుతో నర్సింహులు ఆర్బీఎల్‌‌‌‌ బ్యాంకులో కరెంట్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ ఓపెన్ చేశాడు. నర్సింహులుతో పాటు జగద్గిరిగుట్టలో నివాసం ఉండే క్యాబ్‌‌‌‌ డ్రైవర్లు మహ్మద్‌‌‌‌ మొహినుద్దీన్‌‌‌‌ షేక్(29), పసుపులేటి రాజేశ్​(27) ఇతరుల వద్ద బ్యాంక్‌‌‌‌ అకౌంట్లు సేకరించేవారు. ఈ అకౌంట్లు, సిమ్‌‌‌‌ కార్డులను మొహినుద్దీన్‌‌‌‌, రాజేశ్ ఇండోర్‌‌‌‌‌‌‌‌లోని ఏజెంట్ల ద్వారా కాంబోడియాలోని చైనా స్కామర్లకు పంపించేవారు. చైనా సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ మోసాల ద్వారా కొళ్లగొట్టిన డబ్బు ఈ అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌ అయ్యేది. కొట్టేసిన డబ్బుకు సంబంధించి లావాదేవీలను 48 గంటల్లో పూర్తి చేసేవారు. ఆ తరువాత ఏజెంట్ల ద్వారా అకౌంట్‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌కు సిమ్‌‌‌‌ కార్డులు తిరిగి ఇచ్చేవారు. ఇందుకు గాను మొహినుద్దీన్‌‌‌‌ సైబర్ నేరగాళ్ల నుంచి అకౌంట్కు రూ.లక్ష తీసుకునేవాడు. ఈ మొత్తంలో సగం అకౌంట్‌‌‌‌ హోల్డర్లకు ఇచ్చేవాడు.

రియల్టర్​ను మోసం చేసిన కేసులో దొరికారు..

రంగారెడ్డి జిల్లా హయత్‌‌‌‌నగర్ మండలం హస్తీనాపురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి జులై13న వాట్సాప్ కు 89686 51687 నంబర్​నుంచి మెసేజ్ వచ్చింది. సైబర్ నేరగాళ్లు https://m.ironfxsvip.vip లింక్ పంపించి ట్రేడింగ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరుతో రూ.4.87 కోట్లు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా సీఎస్‌‌‌‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయిన బ్యాంక్‌‌‌‌ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఇందులో ఆర్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌ బ్యాంకులో ఓపెన్‌‌‌‌ చేసిన రిటానా ప్రాపర్టీస్ సహా మరికొన్ని అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌‌‌‌ఫర్ అయినట్లు గుర్తించారు. అకౌంట్‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌ నర్సింహులును అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. దీంతో శివారెడ్డి, మొహినుద్దీన్‌‌‌‌, రాజేశ్​తో కలిసి చేస్తున్న అకౌంట్ల సప్లై దందా బయటపడింది. నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.