టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా

టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన కార్యక్రమం కారణంగా తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు సంఘం జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ప్రకటించారు. గురువారం ఈ మీటింగ్ నిర్వహించాల్సి ఉండగా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గెజిటెడ్ అధికారులు ప్రజా పాలన కార్యక్రమంలో బిజీగా ఉంటామని చెప్పటంతో పోస్ట్​పోన్ చేస్తున్నట్లు బుధవారం రిలీజ్ చేసిన ప్రెస్​నోట్​లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలపై తీర్మానం చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించామని వివరించారు. 

ఈ నెల 31న జరిగే సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వారి ప్రతినిధులు, కేంద్ర కార్యవర్గం విధిగా హాజరు కావాలని కోరారు. టీజీవో కేంద్ర కార్యవర్గ టర్మ్ పూర్తయిందని, మొత్తం కమిటీ రాజీనామా, అడహక్ కమిటీ ఏర్పాటు, కేంద్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. టీజీవోపై ఏలూరు శ్రీనివాస రావు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవమని తెలిపారు. ఆయనకు అసోసియేషన్​లో మెంబర్ షిప్ లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు. 2014, ఎన్నికల టైమ్​లో అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై 31న జరిగే మీటింగ్​లో చర్చించి నిర్ణయాలు వెల్లడిస్తామని తెలిపారు.