- ఈ నెల12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- అక్టోబర్‌లో రాత పరీక్షకు చర్యలు
- నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డిప్యూటీ ఈవో)/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 24 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆయా పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 12 నుంచి ప్రారంభంకానుంది.
జోన్లవారీగా ఖాళీల వివరాలు..
మొత్తం 24 ఖాళీలను మల్టీ జోన్ల వారీగా విభజించారు. మల్టీజోన్–-1 పరిధిలో10 పోస్టులు, మల్టీజోన్–-2 పరిధిలో 14 పోస్టులు ఉన్నాయి. వీటిలో 22 పోస్టులు లోకల్ కు కేటాయించగా, రెండు పోస్టులు అన్ రిజర్వ్ డ్ కింద చూపించారు. మల్టీజోన్– 1లో ఓపెన్ కేటగిరిలో మూడు, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ1, బీసీ 2, ఎస్సీ1లో ఒకటీ, ఎస్సీ 2 కేటగిరీలో ఒకటీ ఖాళీలున్నాయి. ఎస్టీ1, పీహెచ్ కేటగిరిలో ఒకటి చొప్పున ఉన్నాయి. మల్టీజోన్ 2లో ఓపెన్ కేటగిరీలో ఆరు, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీ బీ, బీసీ సీలో ఒక్కొక్కటీ చొప్పున ఖాళీలున్నాయి. ఎస్సీ1, 2 కేటగిరీల్లో ఒక్కోటి, ఎస్టీలో ఒకటి చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈనెల 12 నుంచి అప్లికేషన్లు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూన్ 12 నుంచి జూలై 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత తెలిపారు. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉండగా, పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బీఈడీకి అర్హత ఉన్న డిగ్రీ చేసిన వారే అర్హులని పేర్కొన్నది.
అదేవిధంగా సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పీజీలో 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. కాగా, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. వెయ్యి, ఎగ్జామ్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఇచ్చారు. హైదరాబాద్ (హెచ్ఎండీఏ పరిధి), కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు తమ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను అప్‌డేట్ చేసుకుని అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
