యాదగిరిగుట్ట, వెలుగు: విద్యుత్ అధికారులు స్వయంగా ఇంటింటికీ తిరిగి వినియోగదారుల విద్యుత్ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ‘ప్రజా బాట’ కార్యక్రమం చేపట్టినట్లు ‘తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎస్పీడీసీఎల్) చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం విద్యుత్ అధికారులు చేపట్టిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు నేరుగా ప్రజల గృహ నివాసాల్లోకి వెళ్లి విద్యుత్ కు సంబంధించిన సమస్యలు తెలుసుకుని.. ఆ సమస్యను ఆ క్షణమే అక్కడే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ సమస్య పెద్దదైతే అధికారులే డెడ్ లైన్ పెట్టుకుని.. ఆ డెడ్ లైన్ లోపు సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని, ఇందుకోసమే 'ప్రజా బాట' ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామని చెప్పారు.
విద్యుత్ అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో విద్యుత్ కు సంబంధించి వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. ఎస్ఈ సురేశ్, డీఈ వెంకటేశ్వర్లు, ఏడీ రాజశేఖర్, ఏఈ సురేంద్రనాయుడు, పట్టణ లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు, విద్యుత్ సిబ్బంది ఉన్నారు.
