ఆర్టీసీ డ్రైవర్లు.. స్టీరింగ్‌‌‌‌‌‌‌‌పైనే ..కుప్పకూలుతున్రు..ఆరు నెలల్లో ఐదుగురు మృతి, మరికొందరికి అస్వస్థత

ఆర్టీసీ డ్రైవర్లు.. స్టీరింగ్‌‌‌‌‌‌‌‌పైనే ..కుప్పకూలుతున్రు..ఆరు నెలల్లో ఐదుగురు మృతి, మరికొందరికి అస్వస్థత
  • డ్రైవర్ల కొరతతో పెరుగుతున్న పనిభారం
  • డబుల్‌‌‌‌‌‌‌‌ డ్యూటీలతో మానసిక, శారీరక ఒత్తిడి, నిద్రలేమి
  • రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల పోస్టులు ఖాళీ
  • రిటైర్‌‌‌‌‌‌‌‌ అయిన వారి స్థానంలో కొత్తవారిని రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేస్తలే.

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో ప్రతి నెలా పదుల సంఖ్యలో డ్రైవర్లు రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అవుతుండడం, కొత్త వారి రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో ఉన్న వారిపై రోజురోజుకు పనిభారం పెరుగుతోంది. ఓ వైపు మానసిక ఒత్తిడి.. మరో వైపు శారీరక శ్రమతో డ్రైవర్లు స్టీరింగ్‌‌‌‌‌‌‌‌పైనే ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు నెలల కాలంలో డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో ఐదుగురు ఆర్టీసీ డ్రైవర్లు చనిపోగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

మూడు వేల పోస్టులు ఖాళీ

తెలంగాణ ఆర్టీసీలో మొత్తం 10,100 బస్సులు ఉండగా ఇందులో మూడు వేల అద్దె బస్సులు ఉన్నాయి. వీటికి బస్సుల ఓనర్లే డ్రైవర్లను నియమించుకుంటారు. మిగిలిన ఏడు వేల బస్సుల్లో వెయ్యి వరకు ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బస్సులు ఉండగా.. వీటికి సైతం ప్రైవేట్ డ్రైవర్లే ఉంటారు. సంస్థ తరఫున నడుస్తున్న ఆరు వేల ఆర్టీసీ బస్సులకు 10 వేల నుంచి 12 వేల మంది డ్రైవర్లు ఉండాలి. 

కానీ మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల 50 నుంచి 100 మంది డ్రైవర్లు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. వీరి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవారిని రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 

ఆర్టీసీలో వెయ్యి మంది డ్రైవర్ల నియామకం కోసం ఇటీవల పోలీస్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌బోర్డు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. కానీ ఆ పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉండడంతో డబుల్‌‌‌‌‌‌‌‌ డ్యూటీలు చేయాల్సిందేనని డిపో మేనేజర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో పని ఒత్తిడి పెరిగి డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

బాధితుల్లో 45 నుంచి 50 ఏండ్ల మధ్య  వయస్సు వారే ఎక్కువగుండెపోటుకు గురవుతున్న ఆర్టీసీ డ్రైవర్లలో 45 ఏండ్ల నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలోనే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారని, రోజురోజుకు పెరుగుతున్న పనిభారమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి డ్రైవర్‌‌‌‌‌‌‌‌ ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. కొరత కారణంగా ప్రతి డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌ టైం డ్యూటీలు వేస్తుండడంతో 12 నుంచి 14 గంటలు పనిచేయాల్సి వస్తోంది. లాంగ్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌లో నడిచే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటున్నా.. కండక్టర్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో ఆ డ్యూటీ కూడా డ్రైవర్లపైనే పడుతోంది.

ప్రమాదాలూ ఎక్కువే...

పని ఒత్తిడి కారణంగా కొందరు డ్రైవర్లు గుండపోటుకు గురవుతుంటే.. మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెండు నెలల కింద సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఓ ఆర్టీసీ బస్సు బైక్‌‌‌‌‌‌‌‌, టిప్పర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 22 మంది గాయపడ్డారు. అదే నెల 22న అసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా రెబ్బన వద్ద ఆర్టీసీ బస్సును నడిరోడ్డుపై అకస్మాత్తుగా ఆపడంతో వెనుక వచ్చిన బొలెరోతో పాటు ఇతర వాహనాలకు ప్రమాదం జరిగింది. 

ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ వద్ద వ్యాన్‌‌‌‌‌‌‌‌ను ఓవర్‌‌‌‌‌‌‌‌టేక్‌‌‌‌‌‌‌‌ చేయబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ మీదుగా హన్మకొండ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై అందులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 500 వరకు బస్సు ప్రమాదాలు జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.


ఇటీవలి  ఘటనలు

  • ఈ నెల 17న  సంగారెడ్డి డిపోకు చెందిన జనార్దన్‌‌‌‌‌‌‌‌ (50 ) అనే డ్రైవర్ జోగిపేట నుంచి వట్టిపల్లికి బస్సు నడుపుతుండగా గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ బాధ్యతగా బస్సును పక్కకు ఆపి 40 మంది ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
  • హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ డిపోకు చెందిన రమేశ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు.
  • ఖమ్మం జిల్లా కల్లూరులో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అనే అద్దె బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు డ్యూటీలో ఉండగానే గుండెపోటు వచ్చింది. బస్సును పక్కకు ఆపి, అక్కడే చనిపోయాడు.
  • మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ డిపోకు చెందిన పారేటి జనార్దన్‌‌‌‌‌‌‌‌ స్టీరింగ్‌‌‌‌‌‌‌‌ పట్టుకోగానే అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
  • మిర్యాలగూడ డిపోకు చెందిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లింగయ్య బస్సు నడుపుతూ గుండెపోటుకు గురయ్యాడు. బస్సును రోడ్డు పక్కకు ఆపిన ఆయన.. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించేలోగానే చనిపోయాడు.
  • సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి మొహిదీపట్నం మార్గంలో సిటీ బస్సు నడుపుతున్న డ్రైవర్ తీవ్రమైన ఛాతి నొప్పితో ఇబ్బంది పడి బస్సును పక్కకు ఆపి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. 
  • పరకాల డిపోకు చెందిన ఓ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్తూ... జనగామ సమీపంలోకి రాగానే గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు.
  • భైంసా డిపోకు చెందిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌ గంగాధర్ తెల్లవారుజాము డ్యూటీలో ఉండగానే బస్సులోనే కుప్పకూలిపోయాడు. 
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి కామారెడ్డి వెళ్తున్న బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు మార్గమధ్యలో గుండెపోటు రాగా గమనించిన ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చి ప్రాణాలు కాపాడారు.
  • వనపర్తి నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ జడ్చర్ల సమీపంలో గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. 
  • మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా తొర్రూరు సమీపంలో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ శ్రీనుకు గుండెపోటు రాగా.. అప్రమత్తమైన కండక్టర్ బస్సును పక్కకు ఆపారు.