మతిమరుపు భర్త.. 20 కిలోమీటర్లు నడిచిన భార్య

మతిమరుపు భర్త.. 20 కిలోమీటర్లు నడిచిన భార్య

మతిమరుపు కొన్నిసార్లు ఎన్నో చిక్కులు తెచ్చిపెడుతుంది. అదే మతిమరుపు థాయ్‌లాండ్ లోని ఓ వ్యక్తి తన భార్యనే మర్చిపోయేలా చేసింది. అంతేకాదు ఆమె 20 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం 55ఏళ్ల బూన్‌టమ్ చైమూన్ అనే వ్యక్తి తన భార్య అమ్నుయే చైమూన్ కలిసి మహా సరాఖం ప్రావిన్స్‌లోని తన స్వగ్రామంలో సెలవులు గడపేందుకు బయలుదేరారు. అయితే మధ్యలో తెల్లవారుజామున 3 గంటలకు టాయిలెట్ బ్రేక్ కోసం బూన్ తన కారును రోడ్డు పక్కన పార్క్ చేశాడు. కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో అతని భార్య కారు దిగి సమీపంలోని అడవిలోకి వెళ్లింది. అయితే ఆమె కారు దిగిన విషయం మరిచిపోయిన భర్త బూన్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్త తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిన విషయాన్ని గ్రహించిన ఆమెకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. కారులోనే ఆమె మొబైల్ కూడా ఉండటంతో ఎవరినీ కాంటాక్ట్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. చేసేదేం లేక చిమ్మ చీకటిలో భయంభయంగానే కాలి నడకన సొంతూరుకు బయలుదేరింది.

దాదాపు 20 కి.మీ (సుమారు 12.4 మైళ్ళు) నడిచి, ఉదయం 5 గంటలకు కబిన్ బురి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ కనిపించిన స్థానిక పోలీసులను విషయం చెప్పింది.  భర్త ఫోన్ నెంబర్ గుర్తు లేకపోవడంతో కారులో ఉన్న తన మొబైల్ కు 20 సార్లు డయల్ చేసినా స్పందన రాలేదు. ఎట్టకేలకు ఉదయం 8 గంటల సమయంలో పోలీసుల సాయంతో భర్తను సంప్రదించగలిగింది. ఇంతలో తన భార్య కారులో లేదని వాస్తవాన్ని కూడా ఆమె భర్త గమనించాడు. అప్పటివరకూ ఆమె వెనుక సీటులో గాఢనిద్రలో ఉందని భావించిన ఆయన.. అప్పటికే 150 కిలోమీటర్ల దూరంలోని కోరాట్ ప్రావిన్స్‌కు చేరుకున్నాడు. భార్యను మరిచిపోయిన విషయం తెలియడంతో బూన్.. తన జీవిత భాగస్వామిని తీసుకురావడానికి మళ్లీ వెనక్కి వెళ్లాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు.