‘జంగిల్ బబుల్స్’తో అందమైన అనుభవం

‘జంగిల్ బబుల్స్’తో అందమైన అనుభవం

మీరు చాలా ‘జూ’ లు చూసి ఉంటారు. వాటిలో  ఏనుగులను చాలా దగ్గరగా చూసి కూడా ఉంటారు. కానీ అదంతా ఒక ఎత్తు. థాయ్​లాండ్ లో ఏనుగులను చూడటం మరో ఎత్తు. చూడటమే  కాదు వాటికి చాలా దగ్గరగా నిద్రపోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సదుపాయం ఒక్క థాయ్ లాండ్ లోనే ఉంది. అవే ‘జంగిల్ బబుల్స్’. థాయ్ టూరిజం స్పెషాలిటీ.

ఏనుగులకు థాయ్​లాండ్​కి ఎన్నో ఏళ్లుగా అనుబంధం. థాయ్​ రాచరికపు ముద్రల్లోకూడా ఏనుగు ఉంటుంది. అలాంటి దేశంలో ఇప్పుడు ఏనుగుల సంఖ్య బాగా తగ్గిపోయింది. వీటి సంఖ్యను పెంచాలంటే… జనాలకు ఏనుగును దగ్గర చేయాలన్న ఆలోచన కలిగింది అక్కడి ప్రభుత్వానికి. అడవుల్లో ఉండే ఏనుగుల్ని సిటీలోకి తీసుకురావడం బదులుగా, టూరిస్టులనే అడవిలోకి తీసుకెళ్లి వాటి మధ్య ఒక రాత్రి గడిపేలా చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త రకం టూరిజానికి ‘జంగిల్ బబుల్స్’ అని పేరు పెట్టింది.  థాయ్​లాండ్ టూరిజంలో ఇదొక అద్భుతమైన ఆలోచన. రౌండ్ షేపులో ఉండే నిర్మాణాలనే  ‘జంగిల్ బబుల్స్’ అంటారు. ట్రాన్స్​పరెంట్​ పలకలతో ఫైబర్​ గ్లాస్​లను ఏర్పాటు చేస్తారు. వీటి లోపల టూరిస్టులు ఉండొచ్చు. గంటో, రెండు గంటలో కాదు రాత్రంతా ఉండొచ్చు. గాజు పలకల్లోంచి బయట వాతావరణాన్ని చూసి ఆనందించవచ్చు. లోపల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను చాలా స్పష్టంగా  చూడొచ్చు. నార్త్ థాయ్​లాండ్​లోని ‘అనంతరా గోల్డెన్ ట్రయాంగిల్ ఎలిఫెంట్ క్యాంప్ అండ్ రిసార్ట్’కు వెళితే ఈ వింత అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. ‘చియాంగ్ సయేన్’ పట్టణానికి దగ్గరలో ఉంటుంది ఈ రిసార్ట్​లో 60 వరకు ఏనుగులున్నాయి. ఇందులోనే డిఫరెంట్ ఆలోచనతో  ‘జంగిల్ బబుల్స్’ను ఈమధ్య ఏర్పాటు చేశారు.

ఒక అందమైన అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే టూరిస్టులు ‘జంగిల్ బబుల్స్’ను బుక్ చేసుకుంటారు. ఈ బబుల్​లో ఇద్దరు మనుషులు ఉండాలంటే 563 అమెరికన్ డాలర్లు (థాయ్​ కరెన్సీలో 18 వేల బహ్త్​లు) చెల్లించాల్సి ఉంటుంది. జంగిల్ బబుల్స్ చాలా మోడర్న్. 22 చదరపు మీటర్ల  స్పేస్​లో వీటిని ఏర్పాటు చేశారు. సింపుల్​గా చెప్పాలంటే బబుల్ ఒక మినీ లగ్జరీ హౌస్ అన్నమాట. లోపల కింగ్ సైజ్ బెడ్, టాయిలెట్, షవర్, రెండు కుర్చీలు, ఓ చిన్న టేబుల్, ఏసీ సదుపాయాలన్నీ ఉంటాయి. వీటితో పాటు కాఫీ, టీ పెట్టుకునే ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఒక్క టీవీ మాత్రం ఉండదు. జంగిల్ బబుల్​ నుంచి బయటకు రాకుండానే రాత్రంతా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. పున్నమి రాత్రులు వస్తే బబుల్స్​లో ఉండే టూరిస్టుల ఆనందానికి అంతే ఉండదు. పండుగే పండుగ. చంద్రుడి నుంచి వెన్నెల కిరణాలు జంగిల్ బబుల్స్ లోపల ఉండే టూరిస్టుల మీద పడుతుంటాయి. జనారణ్యానికి దూరంగా రిసార్ట్​లో వెన్నెలను ఆస్వాదించడం నిజంగా టూరిస్టులకు వింత అనుభవమే అవుతుంది. అంతేకాదు, రాత్రిపూట జంతువులు చేసే శబ్దాలు గమ్మత్తుగా ఉంటాయి. రాత్రంతా ఈ శబ్దాలు వింటూ గాజు పలకల్లో ఉంటూ ఆనందిస్తుంటారు టూరిస్టులు.

ఓపెన్ జీపులో సరదాగా…

జంగిల్ బబుల్స్ బుక్ చేసుకున్న టూరిస్టులను సాయంత్రం కాగానే  ఓపెన్ టాప్​ జీపులో రిసార్ట్​ అంతా తిప్పుతారు. అలసట పోగొట్టడానికి  టీ, కాఫీ, బిస్కెట్స్ లాంటి  స్నాక్స్ సర్వ్​  చేస్తారు. అల్లంత దూరాన ఉండే జంతువులను చూస్తూ  స్నాక్స్ తింటూ ఎంజాయ్​ చేస్తారు టూరిస్టులు. అయితే ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఏనుగు సహా ఏ ఇతర జంతువులను ఇక్కడ టూరిస్టులు టచ్ చేయకూడదు. జస్ట్… దగ్గరగా చూసి ఆనందించాలి. ఏనుగులకు ఏదీ తినిపించకూడదు.

ఈ ఇన్నోవేటివ్ ఐడియా గాడెరిక్ హరాంగ్ అనే పెద్ద మనిషిది. ‘అనంతరా గోల్డెన్ ట్రయాంగిల్ ఎలిఫెంట్ క్యాంప్ అండ్ రిసార్ట్’లో కొంతకాలంగా ఆయన పనిచేస్తున్నారు. తమ రిసార్ట్​కు వచ్చే టూరిస్టులకు ఒక అరుదైన అనుభవాన్ని అందివ్వాలన్న ఆలోచనలో నుంచే ‘జంగిల్ బబుల్స్’ కాన్సెప్ట్ పుట్టిందని ఆయన చెప్పారు. ఏనుగులు బాగా తిరిగేచోట ఈ బబుల్స్ నిర్మించారు. ఇవి పూర్తయిన తరువాత ఆయనే  కొన్ని రాత్రులు అందులో నిద్రించి, అవి ఎంతవరకు సేఫ్ అనే విషయాన్ని  స్వయంగా పరిశీలించారు.

‘జంగిల్ బబుల్స్’కు దగ్గరగా తిరుగుతుండే ఏనుగులు కూడా ఈ రిసార్ట్​కు పాతవే. ఆ ఏనుగులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం ఇక్కడి సిబ్బందికి, ఏనుగుల ట్రైనర్లకు కొట్టిన పిండే. కాబట్టి, టూరిస్టులు ‘సేఫ్ జోన్’లో ఉన్నట్లే అంటున్నారు.

లక్ష నుంచి నాలుగు వేలకు

థాయ్​లాండ్​లో 1900 ఆరంభంలో లక్ష ఏనుగుల వరకు ఉండేవి. వందేళ్లు తిరిగేసరికి వాటి సంఖ్య 4,000కు పడిపోయింది. అంటే, నాలుగు శాతాన్ని మించి లేవు. 1986 నాటికే ఏనుగులను అంతరించిపోతున్న జంతువుల జాబితాలోకి థాయ్​ చేర్చింది. ఏనుగుల పెంపకం, వేట, వినియోగం లాంటివి కంట్రోల్​ చేస్తూ చాలా చట్టాలు తెచ్చింది. ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగు వేలకు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు చెబుతున్నారు. థాయ్​లాండ్​లో ఏనుగుల సంఖ్య ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం అడవుల నరికివేతే! ఒకప్పుడు ఆ దేశంలో 90 శాతం అడవులుండేవి. ఇప్పుడు 31.6 శాతానికి అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. 2017లో నేషనల్​ పార్కుల డిపార్టుమెంట్​ జరిపిన సర్వే ప్రకారం అడవి ఏనుగుల సంఖ్య ఏడు నుంచి 10 శాతానికి పెరిగాయని లెక్క కట్టారు. థాయ్​లో కలప వ్యాపారం, టూరిజం ఇండస్ట్రీ జోరుగా సాగుతుంటాయి. అందువల్ల ఏనుగులను దుంగలు మోయడానికి, రవాణా చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు. అలాగే, టూరిస్టు ఎట్రాక్షన్​కికూడా ఏనుగుల సఫారీ నిర్వహిస్తుంటారు.

రాజముద్రలో ఏనుగు తప్పనిసరి

థాయ్​లాండ్​ జాతీయ జంతువు ఏనుగు. ఆ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల అధికారిక సీల్​ (రాజముద్ర)లో ఏనుగు ఉంటుంది. వాటి జెండాల్లోనూ, అఫీషియల్​ సీల్​లోనూ ఏనుగు ఉండడాన్ని బట్టి, అక్కడివాళ్లకు ఎంత అభిమానమో అర్థమవుతుంది. బ్యాంకాక్​ రాజముద్ర ‘ఐరావతంపై ఊరేగుతున్న ఇంద్రుడు’ బొమ్మతో ఉంటుంది.