Thalaivan Thalaivii Review: విజయ్ సేతుపతి 'తలైవన్ తలైవి'.. అంచనాలను అందుకుందా?

Thalaivan Thalaivii Review: విజయ్ సేతుపతి 'తలైవన్ తలైవి'..  అంచనాలను అందుకుందా?

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం " తలైవన్ తలైవి '.  దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా, ఈ సీజన్‌లో అత్యంత ఎదురుచూసిన తమిళ చిత్రాలలో ఒకటి.  భారీ అంచనాలతో జూలై 25న థియేట్లర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.  తొలి రోజు, తొలి షో చూసిన తర్వాత ప్రేక్షకులు ట్విట్టర్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ యాక్టింగ్ పై  పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.  సోషల్ మీడియాలో  ఈ సినిమా గురించి ట్రెండ్ అవుతోంది.  ఇంతకి సినిమా ఎలా ఉంది.. అభిమానులు ఆశించిన స్థాయిలో ఉందా..  లేదా.. చూద్దాం..

కథనం.. నటీనటుల పనితీరు
ఈ చిత్రం నాయకానాయికల మధ్య ఉద్వేగభరితమైన ఘర్షణతో ప్రారంభమై, క్రమంగా కామెడీ చిత్రంగా మారుతుంది. పాండిరాజ్ తనదైన శైలిలో కుటుంబ అనుబంధాలు, గ్రామీణ నేపథ్యం, సహజమైన హాస్యాన్ని ఈ సినిమాలో భాగం చేశారు. ప్రేమకథతో పాటు, కుటుంబ వినోదాన్ని కూడా సమపాళ్లలో అందిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథనాన్ని తీర్చిదిద్దారు. ఇక విజయ్ సేతుపతి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర 'నానుమ్ రౌడీ దాన్' రోజుల ఫామ్‌ను గుర్తుచేస్తూ, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా రాణించాడు. నిత్యా మీనన్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. విజయ్ సేతుపతితో ఆమె కెమిస్ట్రీ తెరపై చాలా ఫ్రెష్‌గా, ఆకర్షణీయంగా కనిపించింది, వారిద్దరూ పర్ఫెక్ట్ ఆన్-స్క్రీన్ జోడీ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. యోగి బాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్ వంటి సహాయక నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు బలాన్ని చేకూర్చారు.

బలాలు, బలహీనతలు.. 
డి. ఇమ్మాన్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్, కామెడీ సన్నివేశాల్లో సంగీతం హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించారు. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ల కెమిస్ట్రీ, నటన అదిరిపోయింది.  గ్రామీణ నేపథ్యంతో పాటు సహజమైన హాస్యం ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పాండిరాజ్ తన మార్క్ ను చూపించారు. అయితే సెకండ్ ఆఫ్ లో అక్కడక్కడా కొంత సాగదీతగా అనిపించిందంటున్నారు ప్రేక్షకులు.

 

'తలైవన్ తలైవి' ఒక సంపూర్ణ గ్రామీణ కుటుంబ వినోద చిత్రం అని ప్రేక్షకులు చెప్పుకోస్తున్నారు. విజయ్ సేతుపతి తన పాత, అద్భుతమైన శైలిలో కనిపించగా, నిత్యా మీనన్ మెరిసింది. లైట్-హార్టెడ్, ఫీల్-గుడ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పక చూడదగినది. కుటుంబంతో కలిసి థియేటర్లలో నవ్వుతూ, ఆనందించడానికి ఇది సరైన ఎంపిక అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

►ALSO READ Mahavatar Narasimha: 'మహావతార్ నరసింహ' రివ్యూ.. అంచనాలను మించిపోయిన విజువల్ వండర్!

ఒక ప్రేక్షకుడు సినిమా చూడటానికి గల కారణాలను వివరిస్తూ, దాని సహజమైన ప్రేమకథ, విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ల బలమైన నటన, పాండిరాజ్ మార్క్ ఫ్యామిలీ-సెంట్రిక్ కథనం, భాషా బేధాలు లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే ప్రాంతీయ ఫ్లేవర్‌ను ప్రశంసించారు. 'తలైవన్ తలైవి' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరొకరు ఈ సినిమా నాయకానాయికల మధ్య ఉద్వేగభరితమైన ఘర్షణతో ప్రారంభమై, క్రమంగా ఒక హృద్యమైన కామెడీ చిత్రంగా మారిందని పంచుకున్నారు. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని, వారిద్దరూ తెరపై అద్భుతమైన జంటగా కనిపించారని ప్రశంసించారు.  ఇంకొకరు విజయ్ సేతుపతి మరోసారి పూర్తి ఫామ్‌లోకి వచ్చాడని కొనియాడారు. 

ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో యోగి బాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, ఆర్.కె. సురేష్ వంటి ఇతర నటీనటులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించి, రచించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. మొత్తానికి మంచి టాక్ అందుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందో చూడాలి.