Thalapathy Vijay: విజయ్ కీలక ప్రకటన.. జన నాయగన్ సినిమానే ఆఖరి మూవీ.. అధికారికంగా ప్రకటించిన తలపతి

Thalapathy Vijay: విజయ్ కీలక ప్రకటన.. జన నాయగన్ సినిమానే ఆఖరి మూవీ.. అధికారికంగా ప్రకటించిన తలపతి

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) అప్ కమింగ్ రిలీజ్ మూవీ 'జన నాయగన్' (Jana Nayagan). సంక్రాంతి స్పెషల్ గా (2026 జనవరి 9న) థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ‌నివారం (డిసెంబర్ 28న) మలేషియాలోని కౌలాలంపూర్‌లో జ‌న‌నాయ‌గ‌న్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. ఈవెంట్‌లో విజ‌య్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సొషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

జన నాయగన్ సినిమానే తన చివరి సినిమా అని విజ‌య్ ప్ర‌క‌టించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు, విజయ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడనే వార్త.. రూమర్స్ గానే వినిపించాయి. ఇప్పుడు విజయ్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. 

నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నా అని విజ‌య్ ఎమోషనల్ అయ్యారు.‘‘సినిమాల ద్వారా అభిమానుల నుంచి ఎంతో ప్రేమ, గౌరవం లభించింది. అయితే ఇకపై తన జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాను. ‘జన నాయగన్’ సినిమా పూర్తయ్యాక తాను నటనకు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నాను. సినిమాలకు స్వస్తి చెప్పడం ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్లు నా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్‌లో ఇంత మ‌ద్దతుగా నిలిచిన వారి కోసం, నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నా’’ అని విజ‌య్ ఎమోషనల్ అయ్యారు. విజయ్ చేసిన ఈ ప్రకటనతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

ఇది విజయ్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా నిలవనుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ H. వినోద్.. అభిమానులకు ఒక ఎమోషనల్ ఫేర్‌వెల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో.. సామజిక కథ, కథనాలతో జన నాయగన్ రూపొందుతుంది. ఈ సినిమాలో విజయ్కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్దే నటిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమిత బైజు, మోనిషా బ్లెస్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే, సుమారు మూడు దశాబ్దాలుగా తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా చక్రం తిప్పుకొచ్చారు విజయ్. మాస్ కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, సామాజిక స్పృహ ఉన్న కథలతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ‘జన నాయగన్’తో తన సినీ ప్రయాణానికి తెరదించనున్నారు. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్.. తన సత్తాచాటేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగనున్నారు.