ఇందిరా పార్కు దగ్గర డ్రామా నడుస్తోంది: తలసాని

ఇందిరా పార్కు దగ్గర డ్రామా నడుస్తోంది: తలసాని

ఇందిరా పార్కు దగ్గర పెద్ద డ్రామా నడుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  కాంగ్రెస్  పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.  ఈ విషయంపై తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ దీక్ష చేస్తున్నకాంగ్రెస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్టు ఉందన్నారు. వారంతా కేవలం ఫోటో షూట్ కోసమే దొంగ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ లో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో 3  గ్రూపులున్నాయనీ…ఈ గ్రూపుల లొల్లి భరించలేకే ఆ 12 మంది టీఆర్ఎస్ పార్టీ లో చేరారని తలసాని అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం మీద నమ్మకం లేక పార్టీ మారారన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎల్పీ ని టీఆర్ఎస్ లో విలీనం చేశారన్నారు.  విలీనం విషయంలో రచ్చ చేస్తున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీ,ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి ఎలా చేర్చుకొందని ఆయన ప్రశ్నించారు.

తమ ప్రభుత్వంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సమానంగా చూశామని తలసాని అన్నారు. గత ప్రభుత్వాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు 50 శాతం మాత్రమే నిధులు ఇస్తే.. తాము మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎంత నిధులు ఇస్తే ప్రతిపక్షం ఎమ్మెల్యేలకి అంతే ఇచ్చామన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆపితే మంచిదని, కాంగ్రెస్ నేతలు ఎక్కువగా మాట్లాడితే వాళ్ల చరిత్ర మొత్తం బయట పెడుతామని తలసాని ఈ సందర్భంగా హెచ్చరించారు.