
హైదరాబాద్, వెలుగు : వరికోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇంత వరకూ లక్ష్యంలో పదిశాతం కూడా వడ్లు సేకరించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడవడమే కాక నీటిలో కొట్టుకుపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. తాలు, మట్టి, తేమ పేరుతో రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నారన్నారు.
ఈ విషయంలో చొరవ తీసుకుని అన్నదాతలకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, ప్రతి మార్కెట్‌లో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించి ధాన్యం నాణ్యతను సర్టిఫై చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు జరుగుతున్న నష్టాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.