తరగని సంపద వినయం

తరగని సంపద వినయం

విద్య వినయేన శోభతే అని చెప్తోంది మన హిందూ సనాతన ధర్మం. వినయం కలిగి ఉన్న విద్య మాత్రమే శోభిస్తుంది. వినయం లేని విద్య, పరిమళం వెదజల్లని మల్లెపువ్వు లాంటిది. అందుకే విద్యాబోధన చేసే గురువులు విద్యతో పాటు వినయాన్ని కలిగి ఉండాలని, వినయం లేని చదువు వ్యర్థమని బోధిస్తారు.

రామాయణంలో శ్రీరాముడు... సకల గుణాభిరాముడు. అందులో వినయం అతనికి పెట్టని ఆభరణం. విశ్వామిత్రుడు యాగం ప్రారంభించాడు. ఆ యాగ విధ్వంసానికి రాక్షసులు పూనుకున్నారు. యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సాయం కోరాడు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు  యాగరక్షణ కోసం కాలిడకన బయలుదేరారు. రాజకుమారులం కనుక రథంలో వస్తామనలేదు. అతి వినయంగా మహర్షి వెంట పాదచారులై ప్రయాణించారు. ఆ కారణంగా విశ్వామిత్రుని దగ్గర బల అతిబల వంటి అనేక అస్త్రాలు నేర్చుకున్నారు. యాగ రక్షణ చేసి, మునులందరి ప్రశంసలు పొందారు. ప్రజల ఆశిస్సులు అందుకున్నారు.  తాటకి, సుబాహులను సంహరించారు. శ్రీరామచంద్రుడు శివధనుస్సును ఎక్కుపెట్టి, సీతమ్మను పరిణయమాడాడు. పరశురాముని విల్లును ఎక్కుపెట్టి అతనికి గర్వభంగం చేశాడు. 

మహాభారతంలో...
కచుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని దగ్గర శిష్యరికం చేసి తన వినయ గుణంతో మృతసంజీవని విద్య నేర్చుకున్నాడు. పాండవులు ద్రోణాచార్యుని దగ్గర వినయగుణంతో అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు. శ్రీకృష్ణుని పట్ల వినయంగా ఉండటం వల్లే, పాండవులకు ఏ సమయంలో కష్టం కలిగినా, తగు సలహాలు ఇస్తూ, వారిని కాపాడాడు. దుష్టులకు ధనం, వంశం, విద్య మదాన్ని కలిగిస్తే, అవే గుణాలు సత్పురుషులకు వినయాన్ని కలిగిస్తాయని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వినయం గురించి చెప్తాడు. దుర్యోధనుడు అహంకారాన్ని విడనాడకపోతే వంశనాశనం తప్పదని చెప్తాడు విదురుడు. ధనమదంతో వినయ గుణాన్ని విడనాడుతారు కౌరవులు. 

ఇతిహాసాలలోను, పురాణాలలోను, చరిత్రలోను ఇటువంటి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ‘నిండు కుండ తొణకదు... సగము కుండ తొణుకును’, ‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది... ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది...’ అనే సామెతలు  తెలిసినవే. వినయ గుణం వల్ల కొత్త విషయాలు తెలుసుకుని జ్ఞానాన్ని పెంచుకోవచ్చు.  అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అందరిచేత ప్రశంసలు పొందవచ్చు. కీర్తి అన్ని ప్రాంతాలకు వ్యాపించి, ఉన్నత వ్యక్తులుగా గుర్తింపు పొందవచ్చు. సంపదలు పొందవచ్చు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది..’ అన్న చందాన... వినయగుణం కలిగినవారికి శత్రువులు నశిస్తారు. మిత్రలాభం కలుగుతుంది. 

అయితే వినయ లక్షణం అతిగా ఉండరాదు. ఆ విధంగా ఉంటే అతి వినయం ధూర్త లక్షణం అంటారు.సాక్షాత్తు మహారాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు... మంత్రి తిమ్మరుసు పట్ల వినయవిధేయతలు కలిగి ఉండటం వలనే, విజయనగర సామ్రాజ్యం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తాను మహారాజుని కనుక మహామంత్రి మాటలను శిరసావహించనక్కరలేదనుకుంటే, ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించలేకపోయేవాడు.

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ
వ కారైః పంచిర్యుక్తః నరో భవతి పండితః

ఒక వ్యక్తి సమాజంలో గౌరవింపబడాలంటే వస్త్రధారణ, శరీరపోషణ, సంభాషణ, విద్య వినయం అనే పంచ వ కారాలు అవసరమని చెప్తాడు భర్తృహరి తన సుభాషితాలలో. విద్యాతత్త్వం గ్రహించినవాడే వినయ సంపదను పొందగలుగుతాడు. ‘ఉద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత’ అని కూడా అన్నాడు భర్తృహరి. ఎన్ని సంపదలున్నా అహంకరించక వినయశీలాన్ని పోషించుకునేవాడిని అందరూ ఆదరిస్తారనేది ఆ కవి భావం.

విద్యా దదాతి వియం వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వాత్‌‌ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖః 

విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయం వలన అర్హత కలుగుతుంది. విద్యావినయాల వలన ధనం కలుగుతుంది. ఆ ధనం వల్ల ధర్మనిరతి ఆ తరవాత సుఖం కలుగుతాయి... అన్నారు పెద్దలు. అంతేనా.. వినయం ఉన్నవాడే లోకంలో భాగ్యశీలి... అని ఒక శాసనంలా కూడా చెప్తారు. సాధారణంగా వినయం లేనివాడు తన కంటే ఎక్కువ ప్రతిభ గల వానిని చూసి ఈర్ష్య పడతాడు. వినయసంపన్నుడు ఇతరుల ప్రతిభను వెలికి తీసుకురావటానికి ప్రయత్నిస్తాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యుడైన వివేకానందునిలోని విద్యా వినయాలను గుర్తించి, తన ఉపన్యాసాల ద్వారా ప్రపంచాన్ని జయించి రమ్మని పంపాడు. అదీ వినయసంపదకి ఉన్న  ఔన్నత్యం.
–డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232