
స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీపై కన్నెర్ర చేసింది. గడచిన 17 ఏళ్లుగా ఐటీ రంగంలో సేవలు అందిస్తున్న సినాప్‌టిక్స్ టెక్నాలజీస్ కంపెనీతో పాటు దాని ప్రమోటర్లపై సెక్యూరిటీస్ మార్కెట్‌లో నిషేధం విధించింది. వాస్తవానికి కంపెనీ 2023లో తన ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను మళ్లించిన ఆరోపణలపై జరిగిన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుందని సెబీ స్పష్టం చేసింది.
సినాప్‌టిక్స్ టెక్నాలజీస్(Synoptics Technologies) కంపెనీ 2008లో స్థాపించబడింది. ఈ సంస్థ నెట్‌వర్క్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సేవలతో పాటు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా ఖర్చులను తగ్గించి పెట్టుబడి పై రాబడిని పెంచడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో 2023 జూలై 13 నుండి ట్రేడింగ్ స్టార్ట్ చేశాయి. IPO సబ్‌స్క్రిప్షన్ జూన్ 30 నుండి జూలై 5 వరకు నిర్వహించబడింది.
►ALSO READ | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సోమవారం సూచీలను నడిపించిన విషయాలివే..
సెబీ దర్యాప్తులో కంపెనీ దాని ఐపీవో లీడ్ మేనేజర్ First Overseas Capital కలిసి రూ.19 కోట్ల ఐపీవో నిధులను మళ్లించినట్లు గుర్తించింది. ఈ మెుత్తం ద్వారా సేకరించిన రూ.35.08 కోట్ల తాజా ఈక్విటీ విలువలో 54% కి సమానం. ఈ మొత్తాన్ని ఐటీ కంపెనీ "మేనేజ్‌మెంట్ ఫీజులు, అండరరైటింగ్, కమిషన్లు, రిజిస్ట్రార్ ఫీజులు, ఇతర IPO ఖర్చులు"గా చూపించినట్లు సెబీ గుర్తించింది. అయితే కంపెనీ ప్రాస్పెక్టస్ లో వెల్లడించిన రూ.80 లక్షల ఫీజు కంటే ఇది అనేకరెట్లు ఎక్కువ కావటంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ డబ్బు బదిలీలు జూలై 12, 2023.. అంటే షేర్లు లిస్టింగ్ కి ఒక రోజు ముందు జరిగాయని-SEBI తెలిపింది. ఇది ఎస్క్రో ఒప్పందం ఉల్లంఘన, ఎందుకంటే లిస్టింగ్, ట్రేడింగ్ ఆమోదాల తర్వాత మాత్రమే ఇలాంటి బదిలీలు అనుమతించబడతాయి. దర్యాప్తులో ఉన్నందున FOCL కూడా కొత్తగా మెర్చెంట్ బ్యాంకింగ్ అసైన్మెంట్లను నిర్వహించకూడదని సెబీ తన ఆదేశాల్లో వెల్లడించింది.
మరి కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల పరిస్థితి..
ప్రస్తుతం సెబీ దర్యాప్తు నేపథ్యంలో Synoptics Technologies షేర్లు హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. సెబీ విచారణ పూర్తయ్యే వరకు మార్కెట్ లో కంపెనీ ప్రమోటర్లు పాల్గొనలేరు, దాంతో కంపెనీ ఫైనాన్షియల్స్ లో గందరగోళం కొనసాగవచ్చు. ఈ చర్య SME సెక్టార్లో ఇతర కంపెనీల్లో కూడా పారదర్శకత అవసరాన్ని ఎత్తి చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ రోజు మార్కెట్లు ముగిసే నాటికి కంపెనీ షేర్ల ధర ఒక్కోటి 5 శాతం పతనమై రూ.95.50 వద్ద నిలిచింది. అయితే ఈ పతనం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.