
పోరాట యోధుడు కొమురం భీం వర్థంతిని రాష్ట్ర పండుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 7న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం వర్దంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
ఏటా ఆశ్వయుజ మాసంలో శుద్ధపౌర్ణమి రాగానే గోండు గిరిజన గూడేల్లో సందడి నెలకొంటుంది. ఆదివాసీల ఆచారం ప్రకారం గొప్ప పోరాట వీరుడైన కొమురం భీం వర్ధంతిని అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. నిజాం నవాబులపై భీం దాదా పోరాట స్ఫూర్తి తెలంగాణకే కాదు. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అప్పటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా అట్టడుగు వర్గాల చరిత్ర, జీవన విధానం, సంస్కృతి, ఆచారాలను సినిమాగా తీసిన సందర్భాలు అరుదుగా కనిపిస్తుంటాయి.
►ALSO READ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 407 పోలింగ్ స్టేషన్లు.. రూ.6 కోట్ల ఖర్చు: ఆర్వీ కర్ణన్
ఆ కోవలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గిరిజనుల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ అడవి బిడ్డల హక్కులైన ‘జల్, జంగల్, జమీన్ హమారా’ నినాదం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పోరాట గాధను ‘కొమరం భీం’ చిత్రంగా ప్రభుత్వమే 1990లో తెరకెక్కించింది. అది1991లో నంది అవార్డును సొంతం చేసుకుంది. నాటి నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆగడాలను అవలీలగా ఎదుర్కొంటూ ఆదివాసీలకు స్వయం పాలన నినాదంతో 1937 నుంచి1940 వరకు వీరోచితంగా సాగిన ‘జోడేఘాట్ తిరుగుబాటు’ ఉద్యమం మహోజ్వల చరిత్రంగా నిలిచింది. తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబులను ఎదిరించిన కొమురం భీం దేశం గర్వించదగిన మహాయోధుడు.