జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 407 పోలింగ్ స్టేషన్లు.. రూ.6 కోట్ల ఖర్చు: ఆర్వీ కర్ణన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 407 పోలింగ్ స్టేషన్లు.. రూ.6 కోట్ల ఖర్చు: ఆర్వీ కర్ణన్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.  దివంగత నేత మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి 2025, నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. జూబ్లీహిల్స్ బైపోల్‎కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం (అక్టోబర్ 6) మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయడంతో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లు తొలగిస్తున్నామని చెప్పారు. నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు రూ.6 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్‎లో మొత్తం 4 లక్షల ఓటర్లు ఉన్నారని..  కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన ఐడీ కార్డులతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. 2025, నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు.

►ALSO READ | దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. జూబ్లీహిల్స్‎తో పాటు ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలు ఇవే

ఎన్నికకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిపడా ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని.. ఫస్ట్ లెవెల్ ఈవీఎం చెకింగ్ కూడా పూర్తయిందని వెల్లడించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ తప్పకుండా పాటించాలని.. మీడియా కూడా ఎలాంటి ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. అభ్యర్థులు తప్పకుండా తమపై ఉన్న కేసుల వివరాలను న్యూస్ పేపర్లు, న్యూస్ చానెల్స్‎లో పబ్లిష్ చేయాలని సూచించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

  • అక్టోబర్ 13న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్‌
  • అక్టోబర్ 13 నుంచి 21 వరకు నామినేషన్లకు గడువు
  • అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ
  • నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక
  • నవంబర్‌ 11న కౌంటింగ్