సెంట్రల్‎ జైలులో రౌడీ షీటర్ బర్త్ డే.. భారీ కేక్.. యాపిల్ పండ్ల దండ.. సెలబ్రేషన్స్ మూములుగా లేవ్..!

సెంట్రల్‎ జైలులో రౌడీ షీటర్ బర్త్ డే.. భారీ కేక్.. యాపిల్ పండ్ల దండ.. సెలబ్రేషన్స్ మూములుగా లేవ్..!

బెంగుళూర్: మర్డర్ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా జైలుకెళ్లిన ఓ రౌడీ షీటర్ జైల్లోనే గ్రాండ్‎గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గ్రాండ్‎గా అంటే మాములు గ్రాండ్‎గా కాదు.. 5 కేజీల భారీ కేక్.. మెడలో యాపిల్ పండ్ల దండ.. పక్కనే తోటి ఖైదీల మధ్య జైల్లో పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. బర్త్ డే వేడుకలను పక్కనే ఉన్న కొందరు తోటి ఖైదీలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఈ షాకింగ్ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరిగింది. రౌడీ షీటర్ దర్జాగా జైల్లో కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్నాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జైలు నిబంధనల పర్యవేక్షణ, ఉల్లంఘనలపై ఆందోళనలను రేకెత్తించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వివరాల ప్రకారం.. శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా అనే రౌడీ షీటర్ ఓ హత్య కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ తన బర్త్ డే వేడుకలను జైల్లోనే గ్రాండ్‎గా సెలబ్రేట్ చేసుకున్నాడు. పూల దండ మాదిరిగా మెడలో యాపిల్ పండ్ల దండ.. తోటి ఖైదీల మధ్య భారీ కేక్ కట్ చేసి పుట్టిన రోజు బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. 

►ALSO READ | శబరిమల ఆలయంలో గోల్డ్ మాయం కేసు.. సిట్ కు అప్పగింత

జైల్లో శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలను తోటి ఖైదీలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‎గా మారడంతో ప్రభుత్వం, జైలు అధికారులు తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు నిబంధనల ప్రకారం జైల్లో ఫోన్ వాడటం నిషేధం. అలాంటిది జైల్లో ఖైదీలను ఫోన్ ఉపయోగించడానికి అనుమతించడమే కాకుండా ఓ హత్య కేసు నిందితుడి పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవనివ్వడం ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు. 

ఇలాంటి ఘటనలతో ప్రభుత్వం, పోలీసులపై ప్రజల్లో నమ్మకం పోతుందని.. బాధిత కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయంటున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైల్లో ఖైదీ బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి సహకరించిన అధికారులపై వేటు వేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నాటకలో శాంతి భదత్రలు పూర్తిగా అదుపు తప్పాయని ఫైర్ అయ్యారు.