
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమాయణం గురించి చాలా కాలంగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ లేటెస్ట్ గా ఈ జంట అత్యంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సన్నిహిత వర్గాలు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. సరిగ్గా ఈ తరుణంలోనే, విజయ్ దేవరకొండ చేతికి కొత్తగా కనిపించిన ఒక ఎంగేజ్‌మెంట్ రింగ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
విజయ్ చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్!
నిశ్చితార్థం వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, విజయ్ దేవరకొండ నిన్న ( ఆక్టోబర్ 9న) కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంకు చేరుకున్న విజయ్‌కి ట్రస్ట్ ప్రతినిధులు శాంతి భవన్ అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. ఇదే సమయంలో మీడియా కంట, ఫ్యాన్స్ దృష్టిలో పడింది విజయ్ చేతికి ఉన్న ఆ ప్రత్యేకమైన రింగ్.
విజయ్ తన నిశ్చితార్థం తర్వాత తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో కనిపించడం, అదీ తన కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడం... ఈ రెండు సంఘటనలూ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన కుడిచేతి ఉంగరం వేలికి మెరుస్తున్న రింగ్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ రింగ్ బంధమే విజయ్-రష్మిక నిశ్చితార్థానికి బలమైన ఆధారాన్ని ఇస్తోందని నెటిజన్లు గట్టిగా నమ్ముతున్నారు.
నాలుగేళ్ల రహస్య ప్రేమాయణం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా 'గీత గోవిందం' (2018) సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' (2019)లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండడంతో, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఏదో ఉందని సినీ విశ్లేషకులకులతో పాటు అభిమానుల్లో ఒక అంచనాకు వచ్చారు.
►ALSO READ | విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం..
ముఖ్యంగా, ముంబైలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఈ జంట నివసిస్తున్నారనే వార్తలు, ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిన సందర్భాలు , జిమ్ సెషన్స్‌కు హాజరవడం.. వంటివి వారి ప్రేమాయణానికి మరింత బలం చేకూర్చాయి. చాలాసార్లు ఇద్దరూ తమ సంబంధాన్ని కేవలం 'మంచి స్నేహం'గా మాత్రమే పేర్కొన్నప్పటికీ, ఇరు కుటుంబాలు అంగీకరించి, గోప్యంగా నిశ్చితార్థం చేశారనే వార్త విజయ్-రష్మిక అభిమానులకు తీపి కబురుగా మారింది.
అభిమానుల స్పెషల్ విషెస్
సోషల్ మీడియాలో ఈ రింగ్ ఫోటోలు షేర్ అవుతున్న వెంటనే, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేయడం మొదలుపెట్టారు. వెండితెరపై'గీత గోవిందం'గా మెరిసిన జంట, నిజజీవితంలో ఒక్కటవ్వడం మాకు చాలా సంతోషాన్నిచ్చింది అని పలువురు ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి విజయ్, రష్మిక లేదా వారి కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం.. అతి త్వరలోనే ఈ జంట తమ అభిమానులందరికీ శుభవార్త చెప్పే అవకాశం ఉందంటున్నారు. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టించిన ఈ మోస్ట్ అవైటెడ్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.