
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. కోర్టు కార్యకలాపాల సమయంలో చీఫ్ జస్టిస్ గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రాకేష్ కిషోర్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. లాయర్ రాకేష్ కిషోర్ దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్ లేదా అథారిటీలోనూ వాదించడం లేదా ప్రాక్టీస్ చేయడంపై నిషేధాన్ని విధించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాకేష్ కిషోర్ సస్పెన్షన్ ఉత్తర్వును వెంటనే అమలు చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సస్పెన్షన్ ఎందుకు కొనసాగించకూడదు..? తదుపరి చర్యలు ఎందుకు తీసుకోకూడదో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని రాకేష్ కిషోర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే..?
సుప్రీంకోర్టు ఆవరణలో సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై సోమవారం (అక్టోబర్ 6) ఓ న్యాయవాది బూటు విసిరాడు. నిందితుడిని 71 ఏళ్ల రాకేష్ కిషోర్‌గా గుర్తించారు. అదృష్టవశాత్తూ ఆ బూటు CJI వద్దకు వెళ్లలేదు. కోర్టు నంబర్ 1 దగ్గర కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిందితుడి రాకేష్ కిషోర్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నప్పుడు.. సనాతనాన్ని అవమానిస్తే సహించను అతడు అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఊహించని పరిణామంతో సీజేఐ గవాయ్ నిర్ఘాంతపోయారు. అయినప్పటికీ కేసు విచారణను కంటిన్యూ చేశారు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని స్పష్టం చేశారు.