
హైదరాబాద్: సీజేఐ బీఆర్ గవాయ్‌పై కోర్టు హాల్లో ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటనపై జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పవన్.. ఇలాంటి చర్యలు ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే చట్టాన్ని గౌరవించడమని హితవు పలికారు. భావోద్వేగంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడమూ అధర్మమేనని అన్నారు. ఆవేశం ద్వారా సాధించేది న్యాయం కాదని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఆవరణలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై సోమవారం (అక్టోబర్ 6) ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని 71 ఏళ్ల రాకేష్ కిషోర్‌గా గుర్తించారు. అదృష్టవశాత్తూ ఆ బూటు CJI వద్దకు వెళ్లలేదు. కోర్టు నంబర్ 1 దగ్గర కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సీజేఐ గవాయ్ సనాతన ధర్మాన్ని అవమానించారని.. అందుకే ఆయనపై దాడికి యత్నించినట్లు నిందితుడి రాకేష్ కిషోర్ అంగీకరించినట్లు సమాచారం. ఈ ఊహించని పరిణామంతో సీజేఐ గవాయ్ నిర్ఘాంతపోయారు. అయినప్పటికీ ఆయన కేసు విచారణను కంటిన్యూ చేశారు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని స్పష్టం చేశారు.