ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది: CJI గవాయ్‎పై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ

ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది: CJI గవాయ్‎పై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‎పై దాడికి యత్నించిన ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన మోడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సీజేఐ గవాయ్‎పై దాడికి యత్నించిన ఘటన దేశంలోని ప్రతిపౌరుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇటువంటి చర్యలకు తావు లేదని స్పష్టం చేశారు. 

‘‘సీజేఐ బీఆర్ గవాయ్‎తో మాట్లాడాను. సోమవారం (అక్టోబర్ 6) ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఈ ఘటన పూర్తిగా ఖండించదగినది. దాడి తర్వాత జస్టిస్ గవాయ్ ప్రదర్శించిన ప్రశాంతతను అభినందిస్తున్నాను’’ అని మోడీ పేర్కొన్నారు. న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల గవాయ్ నిబద్ధతను ప్రశంసించారు ప్రధాని మోడీ. 

సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే..?

సుప్రీంకోర్టు ఆవరణలో సీజేఐ బీఆర్ గవాయ్‎పై సోమవారం (అక్టోబర్ 6) ఓ న్యాయవాది బూటు విసిరాడు. నిందితుడిని 71 ఏళ్ల రాకేష్ కిషోర్‎గా గుర్తించారు. అదృష్టవశాత్తూ ఆ బూటు CJI వద్దకు వెళ్లలేదు. కోర్టు నంబర్ 1 దగ్గర కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

►ALSO READ | ఇక దేశంలోని ఏ కోర్టులో వాదించలేడు: చీఫ్ జస్టిస్ గవాయ్‎పై దాడికి యత్నించిన లాయర్ లైసెన్స్ రద్దు

హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిందితుడి రాకేష్ కిషోర్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నప్పుడు.. సనాతనాన్ని అవమానిస్తే సహించనని అతడు నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఊహించని పరిణామంతో సీజేఐ గవాయ్ నిర్ఘాంతపోయారు. అయినప్పటికీ ఆయన కేసు విచారణను కంటిన్యూ చేశారు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని స్పష్టం చేశారు.