తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 1న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ మూవీ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. అందుకే మా ఎస్వీసీ ద్వారా వరల్డ్‌వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. మంచి హ్యూమర్ ఉన్న సినిమా ఇది. మే 1న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ కండిషన్స్ అప్లై అని పెడుతున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 30న ‘పెద్ది’ ఆల్రెడీ అనౌన్స్ అయింది.
ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కండిషన్స్ అప్లై అని చెప్పాం. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనుకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది’ అని అన్నారు. దిల్ రాజు గారు సినిమా రిలీజ్ చేయడం తమకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని దర్శక నిర్మాతలు అన్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు.
