ఆ బౌల్ ధర రూ.248 కోట్లు

ఆ బౌల్ ధర రూ.248 కోట్లు

కొన్ని వార్తలు చదవడానికి భలేగా అనిపిస్తాయి. అసలు నిజంగా ఇలా జరిగి ఉంటుందా? అనిపిస్తాయి. ఈ వార్త కూడా అలాంటిదే. చిన్న బౌల్​కు కోట్ల రూపాయలు చెల్లించి కొన్న సంఘటన ఇప్పుడు వైరల్​ అవుతోంది. హాంకాంగ్​లో జరిగిన వేలంపాటలో ఈ బౌల్​ను ఒక అజ్ఞాత వ్యక్తి 248 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు. ఇంతకీ ఆ బౌల్​కు అంత ధర పెట్టి కొనడానికి కారణమేంటి అనుకుంటున్నారా? ఆ బౌల్​ చైనాలోని సాంగ్​ అనే రాజవంశానికి చెందినది. 13 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న ఆ బౌల్​ నీలం, ఆకుపచ్చరంగులో ఉంది. వెయ్యి సంవత్సరాల క్రితం ఈ బౌల్​ను బ్రష్​లు కడగడానికి ఉపయోగించేవారట. సదబీ అనే చైనాకు చెందిన ఓ సంస్థ ఈ బౌల్​ను వేలంపాట వేసింది. ఇందులో పాల్గొన్నవారంతా కోటీశ్వరులే కావడం విశేషం.

అంతేకాదు.. వేలంపాటలో పాల్గొన్నవారిలో ఎవరూ వేలంపాట జరిగే ప్లేస్​కి వెళ్లలేదు. అందరూ ఫోన్​లోనే వేలంపాటలో పాల్గొన్నారు. రూ. 67 కోట్ల రూపాయలతో మొదలైన వేలంపాట క్షణాల్లో వందల కోట్లకు చేరింది. అత్యంత అరుదైన ఈ బౌల్​ను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. ఇలాంటి బౌల్​లు ప్రపంచంలో నాలుగు మాత్రమే ఉన్నాయట. 2014లో మింగ్​ వంశానికి చెందిన వైన్​ తాగే బౌల్​ను ఇలాగే వేలంపాట వేశారు. అప్పుడు ఆ బౌల్​ను లియు అనే చైనా శ్రీమంతుడు రూ.235 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బౌల్​ వేలంపాటలో రూ.248 కోట్ల ధర దక్కించుకోవడంతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.