ఈ టూర్ ఎంతో స్పెషల్: చార్​ధామ్ సాహసయాత్రే..!

ఈ టూర్ ఎంతో స్పెషల్: చార్​ధామ్ సాహసయాత్రే..!

మంచు కొండలు.. లోయలు... ఎత్తైన ప్రదేశాలు.. దాటుకుంటూ చేసే యాత్రే చార్​ధామ్​. అందుకే ఈ యాత్ర చాలా స్పెషల్​. నిజానికి ఇదొక సాహసయాత్ర. పది మంది ఫ్రెండ్స్​తోనో చుట్టాలతోనే కలసి వెళ్తే ఇది సాహసయాత్ర ప్లస్​ విహారయాత్రలా ఉంటుంది. యాత్ర జరిగినన్ని రోజులు ధూమ్​ధామ్​ చేయొచ్చు. 


హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. దీన్నే దేవభూమి అని కూడా పిలుస్తారు. ఇక్కడి యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్, బద్రీనాథ్​ టెంపుల్స్​ను కలుపుతూ యాత్ర చేస్తారు​. దీన్నే చోటా ‘చార్​ధామ్’​ యాత్ర అని అంటారు. హిందీలో చార్​ అంటే నాలుగు, ధామ్​ అంటే ఆలయం లేదా మందిరం అని అర్థం.  ఈ నాలుగు మందిరాలను ఒకేసారి దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే మనసు, శరీరం పవిత్రమవుతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని కూడా నమ్ముతారు. ఏటా ఈ యాత్ర ఏప్రిల్​ లేదా మే నెలల్లో మొదలై అక్టోబర్​ లేదా నవంబర్​ నెలల్లో ముగుస్తుంది. ఈ ఏడాది అక్షయ  తృతీయ రోజు అంటే మే6న యాత్ర మొదలైంది. ఈ యాత్ర ఆరు నెలల పాటు జరుగుతుంది.  
 

అలా మొదలైంది
చార్​ధామ్​ యాత్ర​కు ఇంతకు ముందు అంటే1950 వరకు స్థానికులు, సాధువులు, అఘోరాలు మాత్రమే వెళ్లేవాళ్లు. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి భక్తులు వెళ్లేవాళ్లు కాదు. కారణం.. మంచు కొండల్లో ఉన్న ఈ నాలుగు ఆలయాలకు వెళ్లడానికి సరైన రవాణా, వసతి సౌకర్యాలు లేవు. అయితే,1962లో చైనాతో మనదేశానికి యుద్ధం జరిగింది. అప్పుడు ఇక్కడ సైనికుల కోసం రోడ్లు, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఆ తర్వాత నుంచి చార్​ధామ్​ యాత్రకు మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాక మొదలైంది. ఏటా వేసవి (ఏప్రిల్​ లేదా మే)లో ఈ ఆలయాలు తెరుస్తారు. తిరిగి శీతాకాలంలో (అక్టోబర్​/నవంబర్​) మూసేస్తారు. విపరీతంగా కురిసే మంచు కారణంగా ఆరు నెలల పాటు చార్​ధామ్​ యాత్ర ఉండదు. 
 

ఇలా వెళ్తారు
చార్​ధామ్​ను క్లాక్​వైజ్​గా చేయాలని అంటారు. అందుకే మొదట యమునోత్రికి వెళ్తారు. అక్కడి నుంచి గంగోత్రికి చేరుకుంటారు. ఆ తర్వాత కేదార్​నాథ్​ వెళ్తారు. ఆఖరున బద్రీనాథ్​ని సందర్శిస్తారు. యమునోత్రిలో యమునా నది నుంచి, గంగోత్రిలో గంగా నది నుంచి నీళ్లు తెచ్చి కేదారేశ్వరునికి, బద్రీనాథ్​కు అభిషేకం చేస్తారు. రోడ్డు జర్నీ లేదా  హెలికాప్టర్లలో వెళ్లినా టూర్​ను మాత్రం పైన చెప్పిన వరుసలోనే పూర్తిచేస్తారు. కొంతమంది కేవలం కేదార్​నాథ్, బద్రీనాథ్​తోనే టూర్​ ముగిస్తారు. దీన్ని ‘దో ధామ్’ యాత్ర అంటారు. అయితే, దాదాపు అందరూ ఇదే రాష్ట్రంలోని హరిద్వార్​ లేదా రిషికేశ్​ నుంచే యాత్ర మొదలుపెడతారు. ఇక్కడి నుంచి దేవ ప్రయాగ, తెహ్రీ, ధరాసు, యమునోత్రి, ఉత్తర కాశీ, గంగోత్రి, గౌరీఖుండ్​, కేదార్​నాథ్, జోషీమఠ్​ మీదుగా బద్రీనాథ్ చేరతారు. ​రోడ్డు మార్గంలో ఈ యాత్ర చేస్తే కనీసం10 నుంచి12 రోజులు పడుతుంది. అది కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే. హెలికాప్టర్​లో అయితే ఒక్కరోజులో కూడా చూసి రావచ్చు. 
 

అంత తేలికేం కాదు
చార్​ధామ్​ యాత్ర అంత సులువు కాదు. చాలా కష్టమైనది. నాలుగు ఆలయాలూ సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో ఉన్నాయి. అందువల్ల కొండలపైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్​ స్థాయి తగ్గుతుంది. శ్వాస అందదు. చాలా మందికి తలనొప్పిగా అనిపిస్తుంది. వాంతులు అవుతాయి. అలాగే అన్ని చోట్లా సరైన రోడ్లు ఉండవు. కొన్నిచోట్ల సన్నటి కాలి బాటలు ఉంటాయి. వాటి మీద నడవాల్సి ఉంటుంది. గుర్రాలు, పల్లకీల్లో కూడా వెళ్లొచ్చు. కానీ కాలుజారినా, గుర్రం లేదా పల్లకీ అదుపుతప్పినా ప్రమాదమే. ఎందుకంటే పక్కనే లోయలు ఉంటాయి. మరికొన్ని చోట్ల వెహికల్స్​ వెళ్లే రోడ్లు కూడా ఇరుకుగానే ఉంటాయి. ప్రభుత్వం నుంచి వెహికల్స్​ ఫెసిలిటీ ఉన్నా అవి చాలవు. అందువల్ల ప్రైవేటు వెహికల్స్​వాడాల్సిందే. ఇక వాతావరణ పరిస్థితులైతే ఎప్పుడు? ఎలా? మారిపోతాయో ఎవరూ ఊహించలేరు. అకస్మాత్తుగా మేఘాలు కమ్మేసి కుంభవృష్టి కురుస్తుంది. కొండ చరియలు విరిగిపడతాయి. హఠాత్తుగా వరదలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. 2013లో ఇలాంటి వరదల వల్లే  వందలాది మంది చనిపోయారు.  
 

ఆరోగ్యవంతులకే..
‌‌‌‌‌‌‌‌ యాత్రకు బయలుదేరే ముందే పూర్తి ఫిట్​గా ఉన్నారో లేదో చెక్​ చేసుకోవాలి. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మందులు, ప్రిస్కిప్షన్​లు, డాక్టర్ల ఫోన్​ నెంబర్లు దగ్గర ఉంచుకోవాలి.  పెద్దవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు టూర్​కు వెళ్లకపోవడమే మంచిది. యాత్రలో చివరి ధామ్​కు చేరుకోవడానికి ముందు కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. కోవిడ్​ రూల్స్​ పాటించడం తప్పనిసరి.  ఎత్తైన కొండల మీద ప్రయాణించాలి. కాబట్టి గుండె జబ్బులు, డయాబెటిస్​, బీపీ, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. 
‌‌‌‌‌‌‌మధ్యలో తలనొప్పి, వికారం, వాంతులు, మైకం, ఛాతి పట్టేయడం, దగ్గు, వేగంగా గాలి పీల్చడం, పల్స్​ రేటు పెరగడం వంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించాలి.104, 108 హెల్ప్​లైన్లకు ఫోన్​ చేయాలి.  తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్​ వంటి వాటికి యాత్ర సమయంలో దూరంగా ఉండాలి.  ఎండ వేడి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్​స్ర్కీన్స్​ వాడాలి. 
‌‌‌‌‌‌‌‌యూవీ కిరణాల నుంచి కాపాడుకునేందుకు నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలి.  కొంతమంది ఉపవాసం ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో ప్రయాణించొద్దు. మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి.  అదేపనిగా నడవకూడదు. అప్పుడప్పుడు కాసేపు రెస్ట్​ తీసుకుంటుండాలి.  ఎత్తైన ప్రదేశాల్లో వ్యాయామం చేయడం మానేయాలి.  ఆయుర్వేద చికిత్సలు తీసుకొనేవారి కోసం రిషికేశ్​లో చాలా సౌకర్యాలు ఉన్నాయి. సొంతంగా జర్నీ చేస్తుంటే..   సొంత వాహనాల్లో వెళ్ళేవాళ్లు, వెహికల్స్​ను కచ్చితంగా రిజిస్టర్​ చేయించుకోవాలి. 


    వెహికల్​కు సంబంధించిన డాక్యుమెంట్స్​, టూరిస్ట్​ల పూర్తి వివరాలు డ్రైవర్​ దగ్గర ఉంచుకోవాలి.
    పర్వతాలపైకి వెళ్లే వాహనాలకు దారి ఇవ్వాలి. 
    యాత్రకు ముందే ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసు నుంచి గ్రీన్​కార్డ్​ తెచ్చుకోవాలి. 
    మలుపుల్లో వాహనం హారన్​ తప్పకుండా మోగించాలి.
    ఎక్కడంటే అక్కడ వెహికల్​ను పార్క్​ చేయొద్దు. పార్కింగ్​ ప్లేస్​లోనే నిలపాలి. అలాగే 
    వెహికల్​కు తప్పనిసరిగా హ్యాండ్​బ్రేక్​ ఉండాలి. 
    ఉదయం 4 గంటల కంటే ముందు రాత్రి10 దాటాక వెహికల్​ నడపకూడదు. 
    మలుపుల్లో వాహనాలను ఓవర్​ టేక్​ చేయొద్దు.
    ఆల్కహాల్​ తాగి డ్రైవింగ్​ చేయొద్దు.
    వెహికల్​కు పై భాగంలో కూర్చొని ప్రయాణం చెయ్యొద్దు. 
    పాడైపోయిన దుస్తులు, పాలిథీన్​ కవర్లను ఎక్కడపడితే అక్కడ పారేయొద్దు. 

వీటినీ చూడొచ్చు
చార్​ధామ్​తో పాటు ఉత్తరాఖండ్​లో మరిన్ని ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. టైం ఉంటే వీటిని కూడా చూడొచ్చు. అవి.. నీలకంఠ మహాదేవ మందిర్, కైలాశ్ నికేతన్​ టెంపుల్, భరత్​ మందిర్​(రిషికేశ్​), చండీ దేవి టెంపుల్, దక్ష మహాదేవ్​ టెంపుల్​, సతీ కుండ్, హర్​ కి పౌరి, మానస దేవి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–నైనా దేవి టెంపుల్​ ​​(హరిద్వార్​), భాగ్​నాథ్​ మందిర్, కలిపద్​ శక్తి పీఠ్​​(భాగేశ్వర్​), జలేశ్వర్​ ధామ్​(అల్మోరా), కైన్​చి ధామ్​ మందిర్, హనుమాన్​ గర్హి, నైనీ దేవి టెంపుల్, గిరిజాదేవి టెంపుల్​​​(నైనిటాల్​), భవిష్య భద్రి, ఆది భద్రి మందిర్, రుద్రనాథ్​ టెంపుల్, హేమకుండ్​ సాహిబ్​​​(చమోలీ), మధ్యమహేశ్వర్​ మందిర్, కల్పేశ్వర్​ మందిర్​, తుంగనాథ్​ టెంపుల్​ ​(రుద్రప్రయాగ), పాతాళ భువనేశ్వర్​(పితోర్​గఢ్​), జ్వాలా మందిర్​(ముస్సోరీ), పూర్ణగిరి టెంపుల్, బాలేశ్వర్​ 
టెంపుల్​​(చంపావత్​), లఖా మండల్​ టెంపుల్​(డెహ్రాడూన్​).
 

యాత్ర ప్యాకేజీలు ఇలా
చార్​ధామ్​కు దేశం నలుమూలల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి కూడా ఈ ఫెసిలిటీ ఉంది. ఈ ప్యాకేజీల్లో సింగిల్​ ట్రావెలర్​, గ్రూప్​గా వెళ్లడానికి కూడా అవకాశం ఉంది. ఉత్తరాఖండ్​  ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న ప్యాకేజీలో ఒక్కొక్కరికి18వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు అవుతుందని టూరిజం వెబ్​సైట్​లో ఉంది. ఈ ప్యాకేజీ10 రాత్రిళ్లు,10 పగళ్లు ఉంటుంది. హరిద్వార్​ నుంచి ప్రతి సోమవారం ఈ టూర్​ మొదలవుతుంది. అంతకుముందు రోజు ఆదివారమే టూరిస్టులు హరిద్వార్​ చేరుకోవాలి. అక్కడ ఓ హోటల్​లో బస ఉంటుంది. ఆ మరుసటి రోజు యాత్ర మొదలవుతుంది. హరిద్వార్​–పూల్​చట్టి మొదటి రోజు ఉదయం 7గంటలకు ప్రయాణం మొదలవుతుంది. 27 సీట్ల నాన్​ ఏసీ బస్సులో​ ఫూల్​చట్టికి తీసుకెళ్తారు. అందమైన ప్రకృతి పలకరింపుల మధ్య సాగే ఈ ప్రయాణం మధ్యాహ్నం 1గంటకు బార్కోట్​కు చేరుకుంటుంది. అక్కడ లంచ్​ చేశాక మళ్ళీ బస్సు బయల్దేరి సాయంత్రం 5.30గంటలకు పూల్​చట్టికి చేరుతుంది. అక్కడ ఓ హోటల్​లో బస, భోజన వసతి ఉంటుంది. హరిద్వార్​ నుంచి పూల్​చట్టికి 236 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 
పూల్​చట్టి– యమునోత్రి  రెండో రోజు బస్సు ప్రయాణం 8 కిలోమీటర్లు, నడక10 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 6 గంటలకు పూల్​చట్టిలో బస్సు బయల్దేరుతుంది. జానకిచట్టిలో 8గంటలకు బ్రేక్​ఫాస్ట్​ చేసి,11గంటలకల్లా యమునోత్రి చేరుకుంటారు. ఇక్కడి వేడి నీటి బుగ్గల్లో స్నానం చేసి, ఆలయ దర్శనం చేసుకొంటారు. లంచ్​ తర్వాత బయలుదేరి సాయంత్రానికి తిరిగి పూల్​చట్టికి చేరుతారు. రాత్రికి అక్కడే బస. బార్కోట్​–ఉత్తర కాశీ– హర్షిల్‌‌‌‌​ మూడో రోజు ఉదయం 6 గంటలకు బస్సు200 కిలోమీటర్ల దూరంలోని హర్షిల్​కు బయల్దేరుతుంది. మధ్యలో బార్కోట్​ వద్ద బ్రేక్​ఫాస్ట్​కు ఆగుతుంది. మధ్యాహ్నం 1గంటకు ఉత్తర కాశీకి చేరుతుంది. లంచ్​ చేసి, విశ్వనాథ టెంపుల్​ చూశాక మధ్యాహ్నం 2గంటలకు బస్సు మళ్లీ బయల్దేరుతుంది. సాయంత్రం 5గంటలకు హర్షిల్​ చేరుతుంది.

రాత్రికి అక్కడే బస 
గౌరీ కుండ్​–కేదార్​నాథ్​ ఆరో రోజు ఉదయం ప్రయాణం మొదలయ్యాక 35 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం. ఆ తర్వాత17 కిలోమీటర్లు నడవాలి. 9గంటలకు బస్సు గౌరీ కుండ్​కు చేరుతుంది. ఇక్కడి నుంచి10 గంటలకు బయలుదేరి నడక లేదా గుర్రపు స్వారీ, పల్లకీ ద్వారా కేదార్​నాథ్​కు వెళ్లాలి.  సాయంత్రం 5గంటలకు ఆలయం చేరుకుంటారు. పూజలు, దర్శనం పూర్తయ్యాక రాత్రికి అక్కడికి దగ్గర్లోనే బస ఉంటుంది. గౌరీకుండ్​–తిల్వారా ఏడో రోజు ఉదయాన్నే మళ్లీ కేదారేశ్వరుని దర్శించుకుంటారు. అనంతరం బ్రేక్​ఫాస్ట్​ చేశాక గౌరీ కుండ్​కు బయల్దేరతారు. మధ్యాహ్నం1గంటకు గౌరీకుండ్​/రామ్​పూర్​ చేరుకొంటారు. అక్కడ లంచ్​ చేస్తారు. బస్సులో బయల్దేరి 60 కిమీ దూరంలోని తిల్వారాకు సాయంత్రం5గంటలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. జోషీమఠ్​–బద్రీనాథ్​ ఎనిమిదో రోజు తిల్వారా నుంచి 170  కిలోమీటర్ల దూరంలోని జోషీమఠ్​కు మధ్యాహ్నం 12గంటలకు చేరుకుంటారు. మధ్యలో బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. జోషీమఠ్​లో నార్సింగ్​ టెంపుల్​ చూసి, అక్కడే లంచ్​ చేస్తారు.1గంటకు బయల్దేరి సాయంత్రం 4.30గంటలకు బద్రీనాథ్​ చేరతారు. ఆలయంలో స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి బద్రీనాథ్​లోనే బస.
 బద్రీనాథ్​–కాళేశ్వర్​ తొమ్మిదో రోజు ఉదయాన్నే మళ్లీ బద్రీనాథుని దర్శనం చేసుకుంటారు. దగ్గరలోని ‘మన’ అనే అందమైన గ్రామానికి వెళతారు. ఇది చైనా సరిహద్దుకు ఆనుకొని ఉంటుంది. తర్వాత బద్రీనాథ్​ నుంచి బయలుదేరి జోషీమఠ్​కు చేరుకుంటారు. అక్కడే లంచ్​ పూర్తయ్యాక 2గంటలకు బయలుదేరి సాయంత్రానికి కాళేశ్వర్​ చేరుకుంటారు. కాళేశ్వర్​–హరిద్వార్​  పదో రోజు ఉదయాన్నే కాళేశ్వర్​లో బయల్దేరి 230 కిలోమీటర్ల దూరంలోని కౌడియాలకు మధ్యాహ్నం1గంటకు చేరతారు. ఇక్కడ లంచ్​ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5గంటలకు హరిద్వార్​ చేరడంతో యాత్ర ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్​, విజయవాడ, విశాఖపట్నం నుంచి కూడా యాత్రకు ప్రభుత్వ, ప్రైవేటు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో కాస్త అటు ఇటు ధరలు, యాత్రా మార్గాలు ఉంటాయి.                                                                                                                                                                                                                                                                         ::: జి. మహేశ్వర్​

నదీ దేవతలు
చార్​ధామ్​ యాత్రలోని నాలుగు ఆలయాలూ వందల ఏళ్ల కిందట నిర్మించినవే. ఇవన్నీ గర్వాల్​ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి. ఎత్తైన మంచుకొండల్లో వీటిని కట్టారు. ఈ ఆలయాలకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందులో రెండిటిలో నదీ దేవతలు(గంగ, యమున), మరో రెండిటిలో శివకేశవులు(కేదార్​నాథ్​, బద్రీనాథ్​) కొలువై ఉన్నారు. 
యమునోత్రి 
సముద్ర మట్టానికి 3,292 మీటర్ల ఎత్తులో ఉంది. 18వ శతాబ్దంలో గర్వాల్​ రాజు నరేశ్​ ప్రతాప్​ షా ఈ ఆలయాన్ని నిర్మించాడు. పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఇక్కడ విగ్రహ రూపంలో ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలోనే యమునా నది మొదలవుతుంది. ఆలయానికి ఆనుకొని రెండు వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. వీటిలో ఉండే వేడి నీళ్లను స్నానానికి, భోజనం వండుకోవడానికి టూరిస్ట్​లు వాడుతుంటారు. ఆలయం దగ్గర ఉండేందుకు ఆశ్రమాలు, చిన్న గెస్ట్​హౌస్​లు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఉత్తర కాశీ టౌను నుంచి యమునోత్రి129 కిమీ దూరంలో ఉంటుంది. రిషికేశ్​, హరిద్వార్​, డెహ్రాడూన్​ నుంచి కూడా యమునోత్రికి వెళ్లొచ్చు. నేరుగా ఆలయం వరకు వెహికల్స్​ వెళ్లలేవు. యమునోత్రికి ఆరు కిలోమీటర్ల దూరంలోని జానకిచట్టి అనే ఊరి నుంచి కాలినడకన లేదా గుర్రాలు, పల్లకీల్లో వెళ్ళాలి. అలాగే సుమారు13 కిలోమీటర్ల దూరంలోని హనుమాన్​చట్టి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రెండు ట్రెక్కింగ్​ మార్గాలు కూడా ఉన్నాయి. మొదటిది మార్కండేయ తీర్థం మీదుగా వెళ్తుంది. మార్కండేయ మహర్షి ఇక్కడే మార్కండేయ పురాణం రాసినట్టు చెప్తారు. రెండోది ఖర్సాలీ మీదుగా వెళుతుంది. ఈ రెండు మార్గాల్లోనూ కనువిందు చేసే జలపాతాలు ఉన్నాయి. యమునోత్రికి10 కిలోమీటర్ల దూరంలో సప్తర్షి కుండ్​ సరస్సు ఉంది. దీన్ని యమునా నది పుట్టిన చోటు అని చెప్తారు. అలాగే అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు కూడా ఇక్కడ ఉంటాయి. యమునోత్రి ఆలయాన్ని ఏటా అక్షయ తృతీయ రోజు తెరుస్తారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. దీపావళి తర్వాతి రోజు ఆలయాన్ని మూసివేస్తారు.  
గంగోత్రి
ఇది సముద్ర మట్టానికి సుమారు 3,100 మీటర్ల ఎత్తులో ఉంది. ఆలయంలో గంగాదేవి కొలువై ఉంది. గుడికి ఆనుకొని భాగీరథి నది ప్రవహిస్తోంది. హిందూ పురాణాల ప్రకారం భగీరథుడి తపస్సుకు మెచ్చి శివుడి జటాఝూటం నుంచి గంగ కిందకు దూకిన ప్రదేశంగా భావించే గోముఖ్​ ఇక్కడికి ఎగువన19 కి.మీ దూరంలో ఉంది. భగీరథుడి కారణంగా వచ్చింది కాబట్టి ఈ నదిని ‘భాగీరథి’ అని పిలుస్తారు. ఇది దేవ ప్రయాగ వద్ద అలకనందతో కలిశాక గంగానదిగా మారుతుంది. గంగోత్రి ఆలయాన్ని నేపాల్​ సర్వసైన్యాధ్యక్షుడు అమర్​ సింగ్​ థాపా18వ శతాబ్దంలో కట్టాడు. గంగోత్రికి రిషికేశ్​ నుంచి వెహికల్​ ద్వారా12 గంటల్లో వెళ్ళొచ్చు. ఇక్కడి గర్వాల్​ శ్రేణుల్లో హిమనీ నదాలు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఏటా అక్షయ తృతీయ రోజు ఆలయాన్ని తెరిచి దీపావళి రోజు మూసివేస్తారు. గంగోత్రికి సమీపంలోనే భగీరథ శిల, పాండవ గుహ అనే మరో రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి రోడ్డు మార్గం ద్వారా 4 గంటల్లో చేరుకోవచ్చు. గంగోత్రికి రిషికేశ్​ రైల్వేస్టేషన్ 249 కిమీ, డెహ్రాడూన్​ విమానాశ్రయం 250 కిమీ దూరంలో ఉంది. గంగోత్రికి సమీపంలోని కేదార్​తాళ్​, తపోవన్, భైరాన్​ ఘాటి ప్రాంతాలు కనువిందు చేసే ప్రకృతితో అలరిస్తాయి. 

శివకేశవులు కేదార్​నాథ్​ 

యాత్రలో అత్యంత కఠినమైన ధామం ఇదే. రుద్రప్రయాగ్​ జిల్లాలో, సముద్ర మట్టానికి దాదాపు3,586 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి కాస్త ఎగువనే మందాకిని నది పుట్టింది. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కేదార్​నాథ్​ ఆలయం ఒకటి. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు. ఆ తర్వాత ఆది శంకరాచార్యుడు పునర్నిర్మించినట్లు చెప్తారు. ఈ​ ఆలయం రుద్రప్రయాగ్​కు 86 కిలోమీటర్లలో, రిషికేశ్​కు 223 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయం దగ్గరకు నేరుగా చేరుకోవడానికి రోడ్డు సౌకర్యం లేదు. సమీపంలోని గౌరీకుండ్​ నుంచి సుమారు 17 కిలోమీటర్లు నడవాలి. పల్లకీలు, గుర్రపు స్వారీ ద్వారా కూడా వెళ్లొచ్చు. హరిద్వార్​ నుంచి హెలికాప్టర్​ ద్వారా నేరుగా గుడికి చేరుకునే సౌకర్యం కూడా ఉంది. కాలిబాటన వెళ్ళేటప్పుడు అందాలు చూస్తుంటే మనసు నిండిపోతుంది. లోయలు, జలపాతాలు ఉంటాయి. ఆలయం ఉన్న ప్రాంతమైతే మరీ ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఆలయాన్ని అక్షయ తృతీయ లేదా మహాశివరాత్రి రోజు తెరుస్తారు. దీపావళి మరుసటి రోజు మూసివేస్తారు. ఇక్కడికి చేరుకోవాలంటే17 కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండలు, లోయల మీదుగా నడవాలి. కాబట్టి, గౌరీ కుండ్​ దగ్గర యాత్రికుల ఆరోగ్య స్థితి పరిశీలిస్తారు. శారీరకంగా బలంగా లేకపోతే అనుమతించరు.
బద్రీనాథ్​
చమోలీ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి 3,415 మీటర్ల ఎత్తులో ఆలయం నిర్మించారు. నర, నారాయణ అనే పర్వతాల మధ్య, అలకనంద నది ఒడ్డున ఈ గుడి ఉంది. దీన్ని కూడా ఆది శంకరాచార్యుడు నిర్మించినట్లు చెప్తారు. ఆలయంలో బద్రినారాయణుడి విగ్రహం రూపంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడంటారు. గుడి చుట్టూ ఏర్పడిన గ్రామం ఇప్పుడు పెద్ద టౌనుగా మారింది. డెహ్రాడూన్​ నుంచి ఇక్కడికి(100 కి.మీ.) హెలికాప్టర్​ సౌకర్యం ఉంది. రైలు ద్వారా రావాలనుకుంటే రిషికేశ్​ 297 కి.మీ, హరిద్వార్​324 కి.మీ, కొద్వారా327 కి.మీ. చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గం పట్టాలి. బద్రీనాథ్​కు ఢిల్లీ525 కి.మీ, హరిద్వార్, రిషికేశ్​ నుంచి డైరెక్ట్​గా కారు లేదా క్యాబ్​, బస్​ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఆలయం దగ్గర ఉండేందుకు హోటల్స్, గెస్ట్​హౌస్​లు ఉన్నాయి. బద్రీనాథ్​ ఆలయాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్/మేలో తెరుస్తారు. అలాగే నవంబర్​ మూడో వారంలో మూసివేస్తారు. 


తెలుగువారి ఉచిత అన్నదానం
చార్​ధామ్​ యాత్రలో అక్కడక్కడా తెలుగువారి ఉచిత అన్నదాన సత్రాలు కనిపిస్తాయి. వీటిలో అచ్చమైన తెలుగింటి భోజనం లభిస్తుంది. అలాగే కొన్ని అన్నదాన సత్రాల్లో ఉచిత వసతి సౌకర్యం కూడా ఉంది. కరోనా కారణంగా 2020, 2021లో అన్నదాన సత్రాలు మూతపడ్డాయి. అయితే, ఈసారి మళ్ళీ ఇవి తమ సేవను ప్రారంభించాయి. ఇలాంటి అన్నదాన సత్రాల్లో మన రాష్ట్రంలోని సిద్దిపేటకు చెందిన ‘కేదార్​నాథ్​ అన్నదాన సేవా సమితి’ కూడా ఉంది. ఈ సమితి వాళ్లు 2019 నుంచి కేదార్​నాథ్​కు సమీపంలోని సోన్​ ప్రయాగ దగ్గర క్యాంప్​(లంగర్​) వేసి అన్నదానం చేస్తున్నారు. “మేం ఒక గ్రూప్​గా కేదార్​నాథ్​ యాత్రకు 2018లో వెళ్ళాం. అప్పుడు అక్కడ మాకు సరైన తిండి దొరకలేదు. అలాగే యాత్రపై సరైన అవగాహన లేక ఇబ్బందులు కూడా పడ్డాం. ఇవి ఇకపై వచ్చేవారికి సమస్య కాకూడదని నిర్ణయించుకున్నాం. అలా 2019లో 20 మందితో కలసి ‘కేదార్​ నాథ్​ అన్నదాన సేవా సమితి’ ఏర్పాటుచేశాం. ఆ తర్వాత మరో 20 మంది మాకు తోడయ్యారు. మేమంతా కలసి వేలాది మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నాం. కొందరికి మా క్యాంప్​ వద్దే బస కూడా ఏర్పాటుచేస్తున్నాం.  యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. అన్నదానానికి అవసరమైన సరుకులను ఎక్కువగా సిద్దిపేట నుంచే తీసుకెళ్తున్నాం. యాత్ర ముగిసేటప్పటికి సుమారు 50లక్షలకు పైనే ఖర్చవుతోంది. ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి టీ, కాఫీ, టిఫిన్స్​, భోజనం పెడుతున్నాం. ఇదంతా ఆ ఈశ్వర కటాక్షంగా భావిస్తున్నాం’ అంటున్నారు కేదార్​నాథ్​ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్.  

రిజిస్ట్రేషన్​ తప్పనిసరి 
కఠినమైన చార్​ధామ్​ యాత్ర పూర్తిచేయడానికి ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అలాగే యాత్రికుల కోసం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది. ఇవి పాటించడం చాలా ముఖ్యం. యాత్రకు వెళ్లడానికి ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. 
ఇలా చేసుకోవాలి :
 చార్​ధామ్​ యాత్ర రిజిస్ట్రేషన్​కు మూడు పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఉత్తరాఖండ్​ ప్రభుత్వ టూరిజం వెబ్​సైట్ registrationandtouristcare.uk.gov.in ద్వారా చేసుకోవచ్చు. లేదా మొబైల్​లో చేసుకోవచ్చు. అలాగే మూడోది ‘యాత్రా మిత్ర’ పేరుతో వెబ్​సైట్లో సూచించిన ఏ ప్రాంతానికైనా వెళ్లి రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.  రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్ళేవాళ్ళు సాధారణంగా హరిద్వార్​ లేదా రిషికేశ్​ నుంచి ప్రయాణాన్ని మొదలుపెడతారు. హెలికాప్టర్​ ద్వారా అయితే డెహ్రాడూన్​ నుంచి మొదలవుతుంది.  దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు హరిద్వార్​, రుషికేశ్​, డెహ్రాడూన్​కు వచ్చాక రిజిస్ట్రేషన్​ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకే ముందుగానే ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవడం మంచిది.   వెబ్​సైట్​లో చూపించిన రిజిస్ట్రేషన్​ ఫామ్​లో వివరాలు నింపి, కావాల్సిన డాక్యుమెంట్లు అప్​లోడ్​​ చేయాలి. ప్రాసెసింగ్​ ఫీజును ఆన్​లైన్​ లేదా బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో కట్టొచ్చు. రిజిస్ట్రేషన్​ పూర్తయ్యాక కాపీని డౌన్​లోడ్​ చేసుకొని దగ్గరుంచుకోవాలి. 
 హెలికాప్టర్​ ద్వారా వెళ్లాలనుకుంటే heliservices.uk.gov.in వెబ్​సైట్​లో టికెట్లు బుక్​ చేసుకోవాలి. అయితే, వీటికి విపరీతమైన రష్​ ఉంటుంది. టికెట్లు చాలా స్పీడ్​గా అయిపోతాయి. 

మంచి ట్రావెల్​ ఏజెన్సీ చూసుకోవాలి
ఏ యాత్రకైనా ముందు జాగ్రత్తలు అవసరం. చార్​ధామ్​ యాత్రకు ఇవి మరీ ముఖ్యం.  సరైన ట్రావెల్​ ఏజెన్సీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ట్రావెల్​ ఏజెన్సీలను నమ్మి ఏటా చాలామంది టూరిస్టులు మోసపోతున్నట్లు ఫిర్యాదులు రావడమే దీనికి ఉదాహరణ.  చార్​ధామ్​ యాత్రలోని ఆలయాలన్నీ సముద్ర మట్టానికి వేల ఎత్తులో ఉంటాయి. అందువల్ల అక్కడి వాతావరణ పరిస్థితులు తేడాగా ఉంటాయి. వీటిని తట్టుకునేందుకు ముందుగానే శారీరకంగా, మానసికంగా సిద్ధమవ్వాలి. గడ్డకట్టించే ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి వాటికి తగిన దుస్తులు కచ్చితంగా తీసుకెళ్లాలి. ఉన్ని రగ్గులు, రెయిన్​కోట్స్​, గొడుగులు, టార్చిలైట్​, షూస్​ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి.   కొండలు, లోయల వెంట ప్రయాణం చేయాలి. కాబట్టి మెడికల్​ కిట్​ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. అవసరమైన ట్యాబ్లెట్లు, బ్యాండేజీలు, యాంటీ బయాటిక్స్​, పెయిన్​ కిల్లర్లు, యాంటీ సెప్టిక్​ లోషన్స్​​ ఉండాలి.  కొన్నిసార్లు గంటల కొద్దీ ట్రాఫిక్​ జామ్స్​ ఉంటాయి. అందుకని తగినన్ని తినడానికి సరిపడా పదార్థాలు, నీళ్లు దగ్గర ఉంచుకోవాలి. బిస్కెట్స్​, పండ్లు, వాటర్​ బాటిల్స్​, గ్లూకోజ్​, ఎనర్జీ డ్రింకులు తప్పకుండా దగ్గర ఉండాలి.  ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగొద్దు. ఒకవేళ తాగాల్సి వస్తే కాచి, చల్లార్చిన నీళ్లు తాగడం మేలు. లేకపోతే ముందుగానే ఫిల్టర్​ నీళ్లను క్యాన్లలో పట్టుకెళ్లాలి.  ఫోన్లు, కెమెరాల ఛార్జింగ్​ కోసం పవర్​ బ్యాంక్​లు, బ్యాటరీలు ఉండాలి. కాలినడకన వెళ్లాలనుకుంటే గుంపులుగా మాత్రమే వెళ్లాలి. ఒంటరి ప్రయాణం వద్దు.  మధ్యలో ఏదైనా ఆపద వస్తే పోలీసులను కాంటాక్ట్​ చేయాలి. చైనాకు సరిహద్దున ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ మన దేశ సైన్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళ నుంచి కూడా సాయం తీసుకోవచ్చు. 

తొలి యాత్రికుడు  ఆది శంకరాచార్యుడు 
చార్ ధామ్​ యాత్రను మొదట ఎవరు మొదలుపెట్టారనేదానికి చారిత్రక ఆధారాలు లేవు. కానీ, జగద్గురు ఆది శంకరాచార్య సుమారు 1200 ఏండ్ల కిందట ఈ యాత్రకు శ్రీకారం చుట్టాడని చెప్తుంటారు. నిజానికి శంకరాచార్యుడు.. రామేశ్వరం (తమిళనాడు), పూరి(ఒడిశా), ద్వారక(గుజరాత్​), బద్రీనాథ్​(ఉత్తరాఖండ్​)ను కలిపి చేసిన యాత్రనే చార్​ ధామ్​ లేదా బడా చార్​ ధామ్​ యాత్ర అంటారని ప్రచారంలో ఉంది. అలాగే శంకరాచార్యుడే.. గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్, బద్రీనాథ్​ ఆలయాల సందర్శనతో చోటా చార్​ ధామ్​ యాత్ర కూడా చేసినట్లు చెప్తారు.


హెలికాప్టర్​లో 
ఉత్తరాఖండ్​ ప్రభుత్వం, కొన్ని ప్రైవేటు సంస్థలు హెలికాప్టర్​ ద్వారా చార్​ ధామ్​ టూర్​ ప్యాకేజీలు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్వంలో జరిగే హెలికాప్టర్​ టూర్​ 5 పగళ్లు, 4 రాత్రుళ్లు ఉంటుంది. ఇందులో ఒక్కో వ్యక్తికి 10వేల రూపాయలు ఛార్జ్​ చేస్తారు. యాత్ర డెహ్రాడూన్​లో మొదలవుతుంది. ఇక్కడి నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​కు తీసుకెళ్ళి తిరిగి డెహ్రాడూన్​కు తీసుకొస్తారు. మొదటి రోజు ఉదయం 7గంటలకు డెహ్రాడూన్​లోని ఎయిర్​పోర్ట్​ నుంచి హెలికాప్టర్​ బయల్దేరి. ఖర్షాలీ హెలీప్యాడ్​లో 7.45గంటలకు ల్యాండ్​ అవుతుంది. యమునోత్రిలో దర్శనం పూర్తయ్యాక సమీపంలోని పర్యాటక ప్రాంతాలు చూస్తారు. రాత్రికి అక్కడే ఉండి, ఉదయం 7.45కు గంగోత్రికి హెలికాప్టర్​ బయల్దేరి హర్షిల్​ హెలిప్యాడ్​కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి గంగోత్రికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. దర్శనీయ ప్రదేశాలు చూస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే గంగోత్రిలో బయల్దేరి కేదార్​నాథ్​ హెలిప్యాడ్​లో దిగుతారు. ఇక్కడ ఆలయం దర్శనం, పూజా కార్యక్రమాలు, చుట్టుపక్కల ప్రాంతాలను చూశాక, రాత్రికి అక్కడే ఉంటారు. మరుసటి రోజు ఉదయం 10.15గంటలకు హెలికాప్టర్​ ప్రయాణం మొదలవుతుంది. 11గంటలకు బద్రీనాథ్ చేరుకుంటుంది. ఇక్కడ కూడా ఆలయ దర్శనం, పూజలు అయిపోయాక చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తారు. అనంతరం మరుసటి రోజు ఉదయం 11.30గంటలకు హెలికాప్టర్​లో తిరిగి డెహ్రాడూన్​కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. అన్ని చోట్లా బస, భోజన సౌకర్యం ఉంటుంది. చూడాల్సిన ప్రదేశాల కోసం కారు​ అరేంజ్​ చేస్తారు. వీఐపీ దర్శనం కూడా ఉంటుంది. ప్రైవేటు హెలికాప్టర్​లలో లగ్జరీ టూర్​ కూడా ఉంటుంది. దీనికి లక్షకు పైగా ఛార్జ్​ చేస్తారు.