ఆ బాలుడు మాట్లాడిన ఆ ఒక్కమాటే... వాడు చేసిన హత్య బయట పెట్టింది.. !

ఆ బాలుడు మాట్లాడిన ఆ ఒక్కమాటే... వాడు చేసిన హత్య బయట పెట్టింది.. !

హైదరాబాద్‌‌లో సంచలనం సృష్టించిన కూకట్‌‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చేసినట్టు తేలింది. చోరీ చేయడం కోసం సహస్ర ఇంటికి వెళ్లిన నిందితుడు.. తనను చూసిందనే కారణంతో ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దొంగతనం ఎలా చేయాలి? తర్వాత ఎలా ఇంటికి తిరిగి రావాలి? అని నిందితుడు ముందే ఓ పేపర్‌‌‌‌పై రాసుకున్నాడు. దొంగతనం చేసి వచ్చేప్పుడు ఆ ఇంట్లో గ్యాస్​ ఆన్​చేసి రావాలని అనుకున్నాడు.  దీనివల్ల ఫైర్​యాక్సిడెంట్​జరిగి అంతా కాలిపోతుందని భావించాడు. 

పైగా హత్య జరిగిన రోజు అంగీపై రక్తపు మరకలు పడగా, వాటిని చూసిన నిందితుడి తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడలేదు. దీంతో విషయం బయటపడలేదు. విచారణలో భాగంగా పోలీసులు సహస్ర ఇంటికి వచ్చి వెళ్తున్నా సదరు బాలుడిపై ఏ మాత్రం అనుమానం రాలేదు. సీసీ కెమెరాల్లోనూ బయటి వాళ్లు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో ఆ బిల్డింగులో ఉంటున్నవారి చుట్టూనే ఇన్వెస్టిగేషన్​నడిచింది. చివరకు ఆ బిల్డింగు చుట్టుపక్కల వారిని విచారిస్తుండగా బాలుడు మాట్లాడిన ఒక్క మాట అతడిపై అనుమానం కలిగేలా చేసింది. పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించనప్పటికీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ఆ ఒక్క మాటతో అనుమానం.. 

కూకట్‌‌పల్లి దయార్‌‌‌‌గూడలోని బిల్డింగ్‌‌ పెంట్‌‌హౌస్‌‌లో ఈ నెల18న మధ్యాహ్నం సహస్ర దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటి మీద దాదాపు 20 కత్తిపోట్లు ఉండడంతో ఎవరో కావాలనే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తూ వచ్చారు. సహస్ర పేరెంట్స్‌‌కి ఎవరైనా శత్రువులున్నారా? ఎవరితోనైనా గొడవలు, పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలోనే దర్యాప్తు చేస్తూ వచ్చారు. దీంతో అసలు నిందితుడు కళ్ల ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. అయితే ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా ఫలితం లేకపోవడం, బిల్డింగ్‌‌లోకి ఎవరూ వచ్చి వెళ్లిన దాఖాలాలు లేకపోవడంతో పోలీసులు చుట్టపక్కల వారిని విచారించడం మొదలుపెట్టారు. 

ఈ క్రమంలో సహస్ర ఉంటున్న బిల్డింగ్‌‌ పక్కన ఉన్న భవనంలో పదో తరగతి చదివే బాలుడిని విచారించారు. ‘బాబు.. 18న జరిగిన సహస్ర హత్య గురించి నీకేమైనా తెలుసా?’అని పోలీసులు ప్రశ్నించగా.. ‘అంకుల్​సహస్ర నాకు తెలుసు. చాలామంచిది. ఆ రోజు నేను ఇంట్లనే ఉన్నాను. ‘డాడీ..డాడీ..డాడీ’అని సహస్ర పిలిచినట్టు అరుపులు వినిపించినయ్’అని చెప్పాడు. దీంతో ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేయగా.. చుట్టుపక్కల వారెవరూ తమకు అలాంటి అరుపులు వినిపించలేదని సమాధానం చెప్పారు. 

దీంతో అతనొక్కడికే అరుపులు వినిపించడం ఏమిటి? అన్న అనుమానం పోలీసులకు కలిగింది. మరోవైపు సహస్ర ఇంటికి దూరంగా ఓ ఇంట్లో ఉంటున్న ఓ సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌ను పోలీసులు విచారించిన క్రమంలో.. ఆ రోజు బాలుడు సహస్ర ఇంటి దగ్గర కనిపించాడని చెప్పాడు. దీంతో అనుమానం మరింత బలపడింది.