దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు వస్తువులు ఆర్డర్ చేస్తే రోజులు, గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 10 నిమిషాల్లో డెలివరీ అంటూ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు దేశంలోని దిగ్గజ FMCG కంపెనీల అమ్మకాలను శాసిస్తున్నాయి. డాబర్, బ్రిటానియా వంటి కంపెనీల మొత్తం ఆన్‌లైన్ విక్రయాల్లో ఏకంగా 75 శాతం వాటాను ఈ 10 నిమిషాల డెలివరీ యాప్స్ కైవసం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ క్విక్ కామర్స్ తుఫాన్ దెబ్బకు సాంప్రదాయ ఈ-కామర్స్ సైట్లు, మోడరన్ రిటైల్ మాల్స్, చివరకు మన ఇంటి పక్కన ఉండే కిరాణా షాపుల అమ్మకాలు కూడా తగ్గాయి. వినియోగదారుల కొనుగోలు అలవాట్లను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ఐటీసీ, టాటా కన్స్యూమర్, పార్లే ప్రొడక్ట్స్, ఏడబ్ల్యూఎల్ ఆగ్రి బిజినెస్ సంస్థలు 2026 ఆర్థిక సంవత్సరంలో వాటి మొత్తం ఆన్‌లైన్ అమ్మకాల్లో క్విక్ కామర్స్ వాటా 60% నుండి 75% కి పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ వృద్ధి. అలాగే బ్రిటానియా, టాటా కన్స్యూమర్ ఆన్‌లైన్ సేల్స్‌లో క్విక్ కామర్స్ వాటా 70 శాతానికి పైగా ఉంది. ఇక డాబర్ విషయానకి వస్తే.. డిసెంబర్ త్రైమాసికంలో 50 శాతంగా ఉన్న ఈ వాటా.. మార్చితో ముగిసిన 4వ త్రైమాసికానికి ఏకంగా 75 శాతానికి చేరింది. అలాగే తమ డిజిటల్ అమ్మకాలలో 58 శాతం వాటాను ఈ ఛానెల్ నుంచే వస్తున్నట్లు ఐటీసీ ప్రకటించింది.
వినియోగదారులు సౌకర్యానికి, తక్షణ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే బిగ్‌బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలతో పాటు రిలయన్స్ రిటైల్ వంటి పెద్ద నెట్‌వర్క్‌లు కూడా ఇప్పుడు క్విక్ కామర్స్ రంగంలోకి దూకుతున్నాయని పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా అన్నారు. వారంలో ఎక్కువసార్లు చిన్న చిన్న వస్తువులను ఇన్‌స్టంట్‌గా ఆర్డర్ చేసే అలవాటు ప్రజల్లో విపరీతంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణంగా వారు గుర్తించారు.
ప్రీమియం వస్తువుల అమ్మకాలకు బూస్టింగ్..
సాధారణ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కువగా నిత్యావసరాలు అమ్ముడవుతుంటే.. క్విక్ కామర్స్ యాప్స్‌లో మాత్రం ప్రీమియం, లగ్జరీ వస్తువులు విపరీతంగా అమ్ముడవుతున్నాయని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విపిన్ కటారియా తెలిపారు. దీనివల్ల కంపెనీల అనుబంధ వస్తువుల విక్రయాలు 3 రెట్లు పెరిగాయి. భవిష్యత్తులో తమ ఆన్‌లైన్ అమ్మకాల్లో క్విక్ కామర్స్ వాటా 85 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు.
మెట్రో నగరాల నుండి చిన్న టౌన్ల వైపు..
ప్రస్తుతం ఈ 10 నిమిషాల డెలివరీ ట్రెండ్ కేవలం టాప్ 8-10 మెట్రో నగరాలకే పరిమితం కాకుండా.. చిన్న పట్టణాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా ఇది నిలిచింది. బేవరేజెస్, ఫుడ్స్, పర్సనల్ కేర్, హోమ్ కేర్ కేటగిరీలు ఈ ప్లాట్‌ఫామ్స్‌పై దూసుకుపోతున్నాయని డాబర్ సీఈఓ మోహిత్ మల్హోత్రా చెప్పారు. అలాగే ఈ భారీ డిమాండ్‌ను అందుకోవడానికి మారికో వంటి కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ సాంకేతికతలను ఉపయోగించి తమ సప్లై చైన్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయట.
