2 డీజీ డ్రగ్ ధర రూ. 600.?..వారంలో మార్కెట్లోకి

2 డీజీ  డ్రగ్ ధర రూ. 600.?..వారంలో మార్కెట్లోకి

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్ల కోసం డీఆర్డీవో తయారు చేసిన 2 డీజీ డ్రగ్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే రకరకాల ట్రయల్స్​పూర్తి చేసుకున్న ఈ మందు వారంలో మార్కెట్​లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నీళ్లలో కలుపుకొని తాగే ఈ డ్రగ్ ​సాచెట్ రేటు రూ. 500 నుంచి రూ. 600 వరకు ఉండొచ్చని అంటున్నారు. తాజాగా కొన్ని హాస్పిటల్స్, డాక్టర్లకు డ్రగ్ ​శాంపుల్​ ​సాచెట్స్ అందించారు.  

ఏంటీ ఈ 2డీజీ

2 డీజీ (2- డీఆక్సీ- డీ -గ్లూకోజ్) మాడిఫైడ్ గ్లూకోజ్. చక్కెర లాంటి పదార్థాల్లో ఉండే గ్లూకోజ్ మాలిక్యూల్​లో చిన్న మార్పు చేసి దీన్ని తయారు చేస్తారు. క్యాన్సర్​ పేషెంట్లలో సెల్ గ్రోత్​ లేకుండా చూసేందుకు దీన్ని వాడతారు. 2 డీజీ మాలిక్యూల్స్​శరీరంలోకి వెళ్లాక సెల్స్​ (కణం)లోకి ఎంటరవుతుంది. తర్వాత ఎనర్జీ విడుదల చేసేందుకు జరిగే గ్లైకాలసిస్​ ప్రాసెస్​ని 2డీజీ మాలిక్యూల్​ పూర్తిగా నియంత్రిస్తుంది. దీంతో సెల్స్​లో ఎనర్జీ ఉత్పత్తి కాదు. ఎనర్జీ ఉత్పత్తి అయ్యే క్రమంలో అవసరమయ్యే ఆక్సిజన్​ అవసరం ఉండదు. కణాల విభజన జరగదు. దీంతో వైరస్​వ్యాప్తి కంట్రోల్​అవుతుంది. ఎనర్జీ ఉత్పత్తి కాదు గనుక ఆక్సిజన్​అవసరం తగ్గుతుంది. మాడరేట్ నుంచి సివియర్ లక్షణాలున్న పేషెంట్లకు ఈ మందు ఇవ్వగా వాళ్లలో ఆక్సిజన్ రిక్వైర్​మెంట్ తగ్గిందని, త్వరగా కోలుకున్నారని డాక్టర్లు గుర్తించారు. 

ఎట్లా మొదలైంది? 

డీఆర్డీవోకు అనుబంధంగా ఇనిస్టిట్యూట్​ఆఫ్​ న్యూక్లియర్​ మెడిసిన్​ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్​ఎంఏఎస్) సంస్థలో పని చేసే సైంటిస్టుల ఆలోచన ఇది. క్యాన్సర్​పేషంట్ల కోసం చేస్తున్న పరిశోధనలు కరోనా​ వాళ్లకు ఈ మందు ఎందుకు ఉపయోగపడదు అనే ఆలోచన వచ్చింది. దీంతో ప్రాథమిక ప్రయోగాలు మొదలుపెట్టారు. కరోనా​ తొలి వేవ్​లో గతేడాది ఏప్రిల్​లో ఫేజ్​-1 ట్రయల్​ మొదలుపెట్టారు. రిజల్ట్​ సంతృప్తికరంగా రావడంతో సెంట్రల్​ డ్రగ్స్​ స్టాండర్ట్​ కంట్రోల్​ఆర్గనైజేషన్​(సీడీఎస్​సీవో)ను అనుమతి కోరారు. మే నెలలో సెకండ్​ ఫేజ్​ ట్రయల్​కు సీడీఎస్​సీవో అనుమతిచ్చింది. దీంతో రెండు దశల్లో 11 హాస్పిటళ్లలో 110 మంది పేషెంట్లపై ట్రయల్స్​ చేశారు. నవంబర్​లో మూడో ఫేజ్​కు అనుమతి వచ్చింది. 2020 డిసెంబర్​ నుంచి 2021 మార్చి వరకు దేశవ్యాప్తంగా 27 హాస్పిటళ్లలో 220 మంది పేషెంట్లపై 2డీజీని ప్రయోగించారు. అన్నీ సక్సెస్​ కావడంతో 2021 మే 1న డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఎమర్జెన్సీ యూజ్​ కింద వాడేందుకు అనుమతినిచ్చింది. సీసీఎంబీతో కలిసి తొలి దశ ప్రయోగాలు నిర్వహించిన డీఆర్డీవో ఇండస్ట్రియల్​పార్టనర్​గా రెడ్డీస్​ల్యాబొరేటరీస్​తో ఒప్పందం చేసుకుంది. దీంతో రెడ్డీస్ ల్యాబ్స్ 2 డీజీ  ఉత్పత్తిని మొదలుపెట్టింది. ముందు ఓ 10 వేల సాచెట్లతో మొదలుపెట్టి భారీ స్థాయిలో ప్రొడక్ట్​ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

అన్ని వయసుల వారికీ పని చేస్తుంది

2 డీజీ నీళ్లలో కలుపుకొని తాగే పౌడర్ ​కాబట్టి తీసుకోవడం తేలిక. ఈ డ్రగ్​ తీసుకున్న పేషెంట్లలో రెండు మూడ్రోజుల్లోనే తేడా కనిపించిందని సైంటిస్టులు అంటున్నారు. ‘ఒక పేషెంట్​5 రోజులు హాస్పిటల్​లో ఉండాల్సి వస్తే, 2 డీజీ తీసుకుంటే అది రెండు, మూడు రోజులకు తగ్గుతుంది’ అని డీఆర్డీవో డైరెక్టర్​సతీశ్​రెడ్డి తెలిపారు. అన్ని వయసుల వారికీ ఇది పనిచేస్తుందన్నారు. తమ ట్రయల్స్ లో 65 నుంచి 75 ఏళ్ల వాళ్లలోనూ మంచి ఫలితం కనిపించిందని చెప్పారు. 2 డీజీని మిగతా కరోనా ట్రీట్​మెంట్​లో భాగంగా వాడతారు. అందుకే దీన్ని థెరపెటిక్​ మెడిసిన్​ అంటున్నారు. వారం పాటు రోజుకు రెండు పూటలు వాడాల్సిన అవసరం ఉంటుందేమోనని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 

2 డీజీతో మంచి రిజల్ట్స్​

‘కరోనా పేషెంట్లలో 2డీజీ మంచి ఫలితాలిస్తోంది. మా డిఫెన్స్​ సైంటిస్టులు దీనిపై బాగా పరిశోధన చేశారు. క్లినికల్​ట్రయల్స్​లోనూ మంచి ఫలితం కనిపించింది. ఆక్సిజన్​ రిక్వైర్​మెంట్ ఉన్న పేషెంట్లతో పాటు ఆక్సిజన్​పై ఉన్న పేషెంట్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పేషెంట్ల శరీరంలో ఆక్సిజన్​ అవసరాన్ని తగ్గించడం, వైరస్​ వ్యాపించకుండా అడ్డుకోవడానికి ఈ 2 డీజీ అణువులు బాగా ఉపయోగపడతాయి. రెడ్డీస్​ ల్యాబ్స్ ముందు ఓ 10 వేల సాచెట్​లు తయారు చేస్తుంది. వారంలో సాచెట్​లను మార్కెట్లోకి విడుదల చేస్తాం’
- జి. సతీశ్​రెడ్డి, డైరెక్టర్, డీఆర్డీవో