చెస్ ఒలంపియాడ్ కు కౌంట్ డౌన్ షురూ

చెస్ ఒలంపియాడ్ కు కౌంట్ డౌన్ షురూ

న్యూఢిల్లీ: చెస్ ఒలంపియాడ్ కు కౌంట్ డౌన్ షురూ అయ్యింది.100 సంవత్సరాల ఒలంపియాడ్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఈ ఈవెంట్ భారత్ లో జరగనుంది. ఈ ఏడాది జులై 28న చెన్నయ్ లో ‘44వ చెస్ ఒలంపియాడ్’ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 100 రోజుల తర్వాత చెస్ ఒలంపియాడ్ ఆరంభం కానుంది. ఫిడే, ఆల్ ఇండియ చెస్ ఫెడెరేషన్ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా చెస్ ఫెడెరేషన్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. భారత క్రీడా చరిత్రలో ఈ టోర్నమెంట్ ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుందని పేర్కొంది. ఈ ఒలంపియాడ్ లో పాల్గొనేందుకు మొత్తం 150 దేశాల నుంచి ఆటగాళ్లు రానున్నారు. ప్రపంచ చాంపియన్లు, సూపర్ గ్రాండ్ మాస్టర్లు, జాతీయ స్థాయి ఆటగాళ్లు ఇందులో పాల్గొననున్నారు. 

టోర్నమెంట్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, వచ్చే వందేళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటారని ఆల్ ఇండియా చెస్ ఫెడెరేషన్ సెక్రటరీ భరత్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు.  క్రీడా కారుల జాబితాను మే మొదటి వారంలోగా ఆయా దేశాలు పంపిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా కారుల నుంచి వందల సంఖ్యలో వినతులు వచ్చాయన్నారు. 

ఈ మెగా ఈవెంట్ పై ఐదుసార్లు ప్రపంచ విజేత, భారత్ మొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ స్పందించారు. చెస్ ఒలంపియాడ్ భారత్ లో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి ఈవెంట్ తిలకించే అదృష్టం జీవితంలో ఒక్కసారి వస్తుందన్న ఆనంద్.... భారత యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇక మొట్ట మొదటి చెస్ ఒలంపియాడ్ 1924లో పారిస్ లో జరిగింది. పోయినసారి 2020లో ఈ టోర్నీ జరిగింది. అయితే కోవిడ్ వల్ల ఈ ఈవెంట్ ను ఫిడే వర్చువల్ గా నిర్వహించింది. భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా విజేతగా నిలిచాయి.

మరిన్ని వార్తల కోసం...

నియంత పాలనకు వ్యతిరేకంగానే పోరాటం

తేజ్ బహదూర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోడీ