అఫిడవిట్​ ఖర్చులపై నజర్

అఫిడవిట్​ ఖర్చులపై నజర్
  • అఫిడవిట్​.. ఖర్చులపై నజర్
  • కోర్టుల్లో కేసులు పడుతుండడంతో అలర్ట్​గా ఎమ్మెల్యే అభ్యర్థులు
  • ఖర్చుల విషయంలోనూ అదే భయం
  • సీరియస్​గా తీసుకున్న ఆఫీసర్లు 
  • ఈ రెండింటిపై ఈసీ పర్యవేక్షణ

హైదరాబాద్, వెలుగు : ఎలక్షన్లలో పోటీకి రెడీ అయితున్న అభ్యర్థులను ఈసీకి సమర్పించే అఫిడవిట్ టెన్షన్ పెడుతున్నది. దీని విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని పొలిటికల్ లీడర్లు అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు గెలిచినప్పటికీ.. అఫిడవిట్లలో చేసిన కొన్ని పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది.

అదే సమయంలో ఎలక్షన్లలో అభ్యర్థుల ఖర్చుల విషయంలోనూ చేసిన కొన్ని పొరపాట్లకు కొందరిపై అనర్హత వేటు పడింది. దీంతో ఎలక్షన్లల్లో గెలవడం ఎంత ముఖ్యమో.. నామినేషన్​  సందర్భంగా ఇచ్చే అఫిడవిట్.. క్యాంపెయిన్​లో చేసే ఖర్చును జాగ్రత్తగా చూపించడం అంతకంటే ముఖ్యంగా మారింది. దీంతో అఫిడవిట్ల తయారీకి.. ఎలక్షన్ ఖర్చుకు సంబంధించి పోటీలో ఉండాలనుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు ఎక్స్​పర్ట్స్ తో కూడిన స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

గత అఫిడవిట్లు.. ఆస్తులు బేరీజు వేసుకుంటూ

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్​లో పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో పొందుపర్చిన విషయాల్లో అబద్ధాలు చెప్పినట్లు ఎక్కడైనా ఆధారం దొరికితే ఇక అంతే సంగతులు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్​లో ముందు ఒక సమాచారమిచ్చి.. తర్వాత దానిని ట్యాంపరింగ్​ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై కేసు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అదే అఫిడవిట్ అంశంలో మంత్రి గంగుల కమలాకర్​పై కూడా ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నడుస్తున్నది.

మరికొంత మంది ఎమ్మెల్యేలపైనా ఈ తరహా కేసులు నడుస్తున్నాయి. కొందరిపై ఎలక్షన్లలో ఎక్కువ ఖర్చు చేశారని.. ఎన్నిక చెల్లదని కోర్టుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్స్​పర్ట్స్​తో కూడిన టీంను పెట్టుకుంటున్నారు. ఆస్తులు, ఇతర వివరాలన్నింటినీ సేకరించి పెట్టుకుంటున్నారు. గతంలో పోటీ చేసినవాళ్లు అయితే.. అప్పుడు ఏం చూపెట్టారో చెక్​ చేసుకుని.. ఈ సారి ఏం యాడ్​ చేయాలనే వివరాలను రెడీ చేసుకుంటున్నారు.

ALSO READ :  కాంగ్రెస్​లో కొత్త జాబ్.. క్యాంపెయిన్ ప్రతినిధులను నియమిస్తున్న పార్టీ

అధికారులు, ఈసీ అలర్ట్​

ఎన్నికల అఫిడవిట్ విషయంలో ఆఫీసర్లు, ఈసీ కూడా అలర్ట్​గా ఉన్నది. అఫిడవిట్​లో ప్రతి ఒక్క కాలమ్​ను తప్పనిసరిగా నింపాల్సిందే. వివరాలు కరెక్ట్​గా ఉన్నాయా ? లేదా అనేది కూడా ఆఫీసర్లు జాగ్రత్తగా చూడాలి. లేదంటే వారిపై కూడా చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో అఫిడవిట్ విషయంలో ఆఫీసర్లపై కేసులు నమోదయ్యాయి. దీంతో నామినేషన్ల పరిశీలనలో ఎక్కువ టైం అఫిడవిట్ కోసం తీసుకోనున్నారు.

ఎలక్షన్ ఖర్చు విషయంలో నియోజకవర్గాల వారీగా అపాయింట్ అయ్యే ఆఫీసర్లు ప్రతిది జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉన్నది. ఒకవేళ గెలిచిన అభ్యర్థిపై కేసు నమోదైతే.. ఖర్చులు నమోదు చేసిన ఆఫీసర్లను కూడా ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది. దీంతో ఆ విషయంలోనూ అటు అభ్యర్థులు, ఇటు ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు.