
కార్లలోనూ ఇదే ట్రెండ్ పండగ సీజన్లో భారీ ఆఫర్లుండొచ్చు
వెలుగు బిజినెస్ డెస్క్ : రేట్ల పెరుగుదల దెబ్బకి ఎఫర్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ తగ్గిపోతోంది. ఇన్పుట్ ఖర్చులు ఎక్కువవడం, విడిభాగాలు దొరక్కపోవడం వంటివీ ఇందుకు కారణమవుతున్నాయి. మరోవైపు ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మాత్రం దేశంలో దూసుకుపోతున్నాయి. దీనిని బట్టి మనకర్ధమయ్యేదేమంటే డబ్బున్న వారు కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్లు కొనడానికి ముందుకు దూకుతుంటే, డబ్బు లేని దిగువ మధ్య తరగతి వారు మాత్రం మామూలు స్మార్ట్‌ఫోన్ కొనడంలోనూ వెనకబడుతున్నారు.
ఒక్క స్మార్ట్ఫోన్ల విషయంలోనే కాదు, ఈ ట్రెండ్ ఇతర హై వాల్యూ కేటగిరీలు....కార్లు వంటి వాటిలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. దేశంలోని ధనికులపై ధరల పెరుగుదల ఎఫెక్ట్ పెద్దగా లేదనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రేట్ల పెరుగుదల మిడిల్ క్లాస్, పేద ప్రజలపై మాత్రం తన ఎఫెక్ట్‌ను గట్టిగానే చూపిస్తోంది. ఎందుకంటే, వీరు తమ ఆదాయంలో ఎక్కువ భాగం మొదటగా ఫుడ్, ఇతర నిత్యావసరాలపైనే వెచ్చిస్తారు. హై ఎండ్ ప్రొడక్ట్స్ అమ్మకాలకు ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే, ఎంట్రీ లెవెల్లో మాత్రం అమ్మకాలు పడిపోతున్నాయని ఐడీసీ ఇండియా డివైసెస్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ పేర్కొన్నారు. డబ్బున్న వారు మరింత డబ్బున్న వాళ్లుగా ఓవైపు మారుతుంటే, పేదలు మరింత పేదలు అవుతున్నారు.
హై ఎండ్ ఫోన్ల సేల్స్ జూమ్.....
ఉదాహరణకు కార్ల సెగ్మెంట్ తీసుకుందాం. అధిక రేటున్న కార్ల అమ్మకాల గ్రోత్ తక్కువ రేట్ల కార్ల సేల్స్ కంటే ఎక్కువగా రికార్డవుతోంది. రూ.10 లక్షలకి మించిన రేట్ల కార్ల అమ్మకాలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 38 శాతం పెరిగితే, చిన్న కార్ల అమ్మకాలు మాత్రం 7 శాతమే పెరిగాయని క్రిసిల్ రిపోర్టు వెల్లడిస్తోంది. ఇదే తరహాలో ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు కూడా సాగుతున్నాయి. రూ. 40 వేలకి మించిన స్మార్ట్ఫోన్ల సేల్స్ జూన్ క్వార్టర్లో 83 శాతం పెరిగాయి. రూ. 8 వేల లోపు స్మార్ట్ఫోన్లు (ఎంట్రీ లెవెల్) సేల్స్ మాత్రం ఇదే కాలంలో 5 శాతం పడిపోయినట్లు ఐడీసీ చెబుతోంది. అంతకు ముందు ఏడాది జూన్ క్వార్టర్లో ఈ సేల్స్ 17 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. మార్కెట్ సైజే తగ్గుతోందనుకుంటే, అన్ని సెగ్మెంట్లలోనూ అది కనబడాలి. కానీ, ఇప్పుడు మనకి కనబడుతున్నది అసాధారణమైన ట్రెండ్ అని సింగ్ చెప్పారు. రేట్ల పెరుగుదల వల్ల స్మార్ట్ఫోన్ల మార్కెట్ అంతకు ముందు క్వార్టర్‌తో పోలిస్తే జూన్ క్వార్టర్లో 5 శాతం తగ్గిందన్నారు. ఎంట్రీ లెవెల్ ఫోన్ల సెగ్మెంట్లో (రూ.10 వేల లోపు) డిమాండ్ నాలుగో వంతుకు పడిపోయింది. ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతకు ముందుతో పోలిస్తే ఖరీదవుతున్నాయి. ఫ్యూయెల్ రేట్లు బాగా ఎక్కువగా ఉండటంతో జీవన వ్యయం చాలా మందికి పెరిగింది. ఎఫర్డబుల్ మొబైల్ విభాగంలో అమ్మకాలు 25 శాతం తగ్గిపోవడంతో, కంపెనీల దగ్గర స్టాక్స్ పేరుకుపోతున్నాయని మైక్రోమాక్స్ కో ఫౌండర్ వికాస్ జైన్ చెప్పారు.
ఆఫర్లతో ముంచెత్తుతాయా...
స్టాక్స్ నిల్వలు పెరిగిపోతే కొత్త మోడల్స్‌కి దారి ఇచ్చేలా పాతవాటిపై డిస్కౌంట్ ఆఫర్లను గుమ్మరిస్తాయి కంపెనీలు. సాధారణంగా ఫెస్టివల్ సీజన్లోనే ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఆగస్టు తర్వాత మన దేశంలో ఫెస్టివల్ సీజన్ మొదలవుతుంది. గతంలో కంటే ఎక్కువగా ఈసారి ఆన్లైన్, ఆఫ్‌లైన్ డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ స్టాక్స్‌ను అమ్ముకోవాలంటే భారీ ఆఫర్లు ఇవ్వక తప్పదని వికాస్ జైన్ చెబుతున్నారు.
ఎంట్రీ లెవెల్ విభాగంలో సప్లయ్ సమస్యలు ఉన్నాయి. అంతేకాదు, రేట్లు పెరగడంతో కన్జూమర్ డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఆ భారాన్ని కన్జూమర్లపైనే మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు మోపుతున్నాయి.
- ప్రచీర్ సింగ్, సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్