ఏఐ నమ్మి కొంపముంచుకున్న టెక్కీ.. కోడ్ క్రాష్.. ఉద్యోగం ఊస్ట్..!

ఏఐ నమ్మి కొంపముంచుకున్న టెక్కీ.. కోడ్ క్రాష్.. ఉద్యోగం ఊస్ట్..!

టెక్నాలజీ పెరిగింది కదా కంపెనీ స్పీడుగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని ఒత్తిడి చేస్తోందని గుడ్డిగా ఏఐ మీద ఆధారపడితే కెరీర్ ఎలా ప్రమాదంలో పడుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. డెడ్‌లైన్ల ఒత్తిడి తట్టుకోలేక ఏఐ రాసిన కోడ్‌ను వాడిన ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. చివరికి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రెడ్డిట్ లో ట్రెండ్ అవుతున్న దీనిలో టెక్కీలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సదరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఒక స్టార్టప్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మొదట్లో పని సాఫీగానే సాగినా.. ప్రాజెక్ట్ డెడ్‌లైన్లు దగ్గరపడటంతో పని భారం పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ కోడ్ రాయాలనే ఒత్తిడిలో అతను ఏఐ టూల్స్ వాడటం మొదలుపెట్టాడు. ఏఐ కోడ్ రాసివ్వడం, దాన్ని ఇతను టకటకా ప్రాజెక్టులో కలిపేయడంతో పనులు వేగంగా పూర్తవుతున్నట్లు కనిపించాయి. కానీ అసలు సమస్య ఆ తర్వాతే స్టార్ట్ అయ్యింది. 

ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో కంపెనీ సిస్టమ్స్ అన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. టీమ్ మొత్తం తలలు పట్టుకుంది. అసలు సమస్య ఎక్కడ వచ్చిందో తెలియక తెల్లవార్లూ కష్టపడ్డారు. మరుసటి రోజు తీరా ఆరా తీస్తే.. సమస్య మూలాలు ఆ జూనియర్ డెవలపర్ రాసిన కోడ్‌లో ఉన్నట్లు తేలింది. అతను ఏఐతో కోడ్ రాయించడమే కాకుండా, దాన్ని రివ్యూ చేయడానికి కూడా ఏఐనే వాడాడట. దీంతో ఆ కోడ్ చదవడానికి క్లిష్టంగా మారి, బగ్‌ను కనిపెట్టడం టీమ్‌కు నరకంలా మారిపోయిందట. అంతా ఏఐకి తెలుసులే అదెందుకు తప్పు చేస్తుంది అనుకున్నాడో ఏమో కాపీ పేస్టింగ్ చేసినంత స్పీడుగా సమస్యలు పరిష్కారం అవ్వవని గ్రహించలేక పోయాడనుకుంట.

తప్పెవరిది..? కంపెనీ నిర్ణయం సరైనదేనా..?

ప్రొడక్షన్ క్రాష్ అవ్వడం ఇది రెండోసారి కావడంతో కంపెనీ అతన్ని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించింది. టీసీఎస్ సీఈఓ కృతివాసన్ లాంటి వాళ్లు కూడా తమ టెక్కీలను ఏఐ వాడి పనిచేయమంటుంటే ఒకపక్క మరోపక్క దాని వల్ల నష్టాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. తాజా ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ రాసిన కోడ్‌ను కనీసం చెక్ చేసుకోకుండా వాడటం డెవలపర్ తప్పేనని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం జూనియర్ డెవలపర్ రాసిన కోడ్‌ను సరిగ్గా రివ్యూ చేయకుండా ఆమోదించిన సీనియర్లు, మేనేజర్లదే అసలు బాధ్యత అని, కేవలం అతన్ని బలిపశువును చేశారని మండిపడుతున్నారు.

మెుత్తానికి టెక్కీ ఉద్యోగం పోగొట్టిన ఏఐ అనేది మన పనిని సులభం చేసే ఒక సాధనం మాత్రమేనని అందరూ గ్రహించాలి. అది మన మెదడుకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కోడింగ్ వంటి కీలకమైన పనుల్లో ఏఐని గుడ్డిగా నమ్ముకుంటే.. అది సిస్టమ్‌ను మాత్రమే కాదు, కెరీర్‌ను కూడా క్రాష్ చేస్తుందని ఇప్పటికైనా అర్థం చేసుకుని దాన్ని ఎంత వరకూ వాడాలో అంత వరకే పరిమితం చేస్తే మంచిదనే వాదన వినిపిస్తోంది.