ఈసీ నగర్ సొసైటీ స్థలంపై ఆరోపణలు అవాస్తవం

ఈసీ నగర్ సొసైటీ స్థలంపై ఆరోపణలు అవాస్తవం

సికింద్రాబాద్: చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసికి మార్ట్ గేజ్ చేసిన ఎకరం స్థలం కబ్జాకు గురవుతోందంటూ గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని స్థల యజమాని వెంకటేశ్వర ప్రసాద్ ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘట్ కేసర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 186/2 లో తాము 1969లో ఐదు ఎకరాలు కొనుగోలు చేసి.. ఇందులో నుండి ఒక ఎకరం స్థలాన్ని ఈసీ నగర్ హౌజింగ్ సొసైటీకి విక్రయించామన్నారు.  
ఈసీ నగర్ హౌజింగ్ సొసైటీ తమ లేఅవుట్ మార్ట్ గేజ్ కింద ఎకరం స్థలం జీహెచ్ఎంసీకి అప్పగించిందని, సొసైటీ లే అవుట్ లో మాత్రం ఈ మార్ట్ గేజ్ స్థలంలోని ఫేస్-1లో పార్కు స్థలం, 2వ ఫేస్ లో ప్లాట్లుగా చేసి విక్రయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల విషయమై ఈసీ హౌజింగ్ సొసైటీ కోర్టులో వేసిన దావా వీగి పోయిందన్నారు. సొసైటీ ప్రతినిధులు హై కోర్టులో అప్పీలు చేసుకోగా 8 ఏళ్లుగా  పెండింగులో ఉందన్నారు. దీనికి రాజకీయ రంగు పులుముతూ తమ బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్థలం యజమాని అయిన తనపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.